Sourav Ganguly: గంగూలీ కొత్త ఇన్నింగ్స్- ఆ టీమ్ కు హెడ్ కోచ్ గా..!
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మరో కొత్త పాత్రలో దర్శనమివ్వబోతున్నాడు. ఈ మేరకు ఆయన కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రంగం సిద్దమవుతోంది. ఈ మేరకు ఇవాళ ఓ కీలక ప్రకటన విడుదలైంది. ఇప్పటివరకూ క్రికెటర్ గా, కెప్టెన్ గా, బీసీసీఐ బాస్ గా కనిపించిన ఈ బెంగాల్ టైగర్.. ఇప్పుడు జూనియర్లకు మార్గదర్శకత్వం వహించేందుకు సిద్ధమయ్యాడు.
దక్షిణాఫ్రికాలో జరిగే ఎస్ఏ20 లీగ్ లో ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్ గా సౌరభ్ గంగూలీని నియమిస్తూ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ ప్రకటన చేసింది. ప్రిన్స్ క్యాపిటల్స్ శిబిరానికి రాజరికపు ఆకర్షణ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు! సౌరవ్ గంగూలీని మా కొత్త ప్రధాన కోచ్‌గా ప్రకటించడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము" అని జట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది.

ఇప్పటివరకూ వివిధ పాత్రల్లో రాణించిన సౌరభ్ గంగూలీ తొలిసారి క్రికెట్ కోచ్ గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఇప్పటివరకూ ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టుకు ప్రధాన కోచ్ గా ఉన్న ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జోనాథన్ ట్రాట్ స్థానంలో గంగూలీ బాధ్యతలు చేపడతాడు. 2008లో క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాక గంగూలీ ఎక్కువగా పాలనా పరమైన పాత్రల్లోనే కనిపించాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన గంగూలీ.. ప్రస్తుతం ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా ఉన్నాడు. దీంతో పాటు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాడు.

గతంలో ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యంలో డైరెక్టర్ గానూ గంగూలీ పనిచేశాడు. ఇప్పుడు వీటన్నింటినీ భిన్నంగా ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టుకు ప్రధాన కోచ్ గా మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే 17 ఏళ్ల తర్వాత నేరుగా మైదానంలో గంగూలీ కనిపించబోతున్నాడు. సెప్టెంబర్ 9న ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు ఆటగాళ్ల వేలం జరగబోతోంది. ఈ నేపథ్యంలో గంగూలీ ఎంపిక ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications