పెళ్లి పీటలు ఎక్కనున్న పీవీ సింధు: బిగ్ షాట్..!!
PV Sindhu marriage: స్టార్ షట్లర్ పీవీ సింధు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పాసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని పెళ్లాడనున్నారు. ఈ నెల 22వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ వివాహ వేడుకలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని పీవీ సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు.
డిసెంబర్ 24వ తేదీన హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ను నిర్వహిస్తారు ఇరు కుటుంబాల వారు. ఈ నెల 20వ తేదీ నుంచే పెళ్లి మొదలవుతాయని పీవీ రమణ చెప్పారు. ఈ నెల 19వ తేదీ నాటికి ఇరు కుటుంబాల వారు ఉదయ్‌పూర్‌కు బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది.

హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది పాసిడెక్స్ టెక్నాలజీస్. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, డేటా మేనేజ్‌మెంట్, డేటా అనలైజింగ్ సెగ్మెంట్‌కు సంబంధించిన సంస్థ ఇది. 2003లో ఇది ఏర్పాటైంది. ప్రముఖ కంపెనీలకు డేటా మేనేజ్‌మెంట్ సేవలను అందిస్తోంది.
అమెరికా, కెనడాల్లోనూ దీనికి కార్యాలయాలు ఉన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, సెక్యూరిటీస్, రిటైల్, టెలికం, క్రెడిట్ బ్యూరో రంగాలతో పాటు కొన్ని ప్రభుత్వం విభాగాలు కూడా పాసిడెక్స్ టెక్నాలజీస్ క్లయింట్స్‌గా ఉంటోన్నాయి. ఈ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్నారు వెంకట దత్త సాయి.
పెళ్లి తరువాత కూడా పీవీ సింధు.. క్రీడారంగంలో కొనసాగే అవకాశాలు లేకపోలేదు. పెళ్లి వేడుకలు ముగిసిన అతి కొద్దిరోజుల్లోనే ఆమె నెక్స్ట్ సీజన్ కోసం సన్నద్ధమౌతారని పీవీ రమణ తెలిపారు. దీనికి అవసరమైన ట్రైనింగ్ సెషన్స్‌కు అటెండ్ అవుతారని అన్నారు. కాగా- ఆదివారమే ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ విజేతగా నిలిచారు పీవీ సింధు.
ఒలింపిక్స్‌లో రెండుసార్లు పతకాన్ని సాధించారు పీవీ సింధు. 2016లో రియో డి జనేరియో, 2020లో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో పతకాలను సాధించారు. బ్యాడ్మింటన్‌లో కేరీర్ అత్యుత్తమ ర్యాంక్ సాధించారు. 2017లో రెండో స్థానం వరకూ ఎగబాకారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో విఫలం అయ్యారు.












Click it and Unblock the Notifications