పాకిస్తాన్ కు చెడా మడా ఇచ్చిపడేసిన లెజెండరీ ప్లేయర్స్.. !!
టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలంటూ పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయంపై టీమిండియా మాజీ క్రికెటర్, దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా, అలాగే దేశీయ ఆటగాళ్లు, మాజీల నుంచి ఒత్తిడి పెరిగితే పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ క్రికెటర్లు తరచుగా తమ నిర్ణయాలను మార్చుకోవడం ఆనవాయితీగా మారిందని ఎద్దేవా చేశారు. ఇంకోసారి ఇలా చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఆజ్ తక్‌తో గవాస్కర్ మాట్లాడారు. షాహిద్ అఫ్రిది లాంటి వారు పదేపదే రిటైర్‌మెంట్లు ప్రకటించి, వాటిని వెనక్కి తీసుకోవడాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. భారత్ తో మ్యాచ్ ను బహిష్కరించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా వచ్చే నాలుగైదు రోజుల్లో పాకిస్తాన్ పై నలుమూలల నుండి ఒత్తిళ్లు రావొచ్చని అన్నారు. పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు కూడా దీనిపై మాట్లాడటం ప్రారంభించినప్పుడు ఆ జట్టు తన వైఖరిని మార్చుకుంటుందని చెప్పారు.

టీ20 ప్రపంచ కప్ లీగ్ దశలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఈ నెల 15న కొలంబోలో మ్యాచ్ జరగాల్సి ఉంది. భద్రత కారణాలను చూపుతూ భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇందులో కొత్తేమీ లేదని సునీల్ గవాస్కర్ అన్నారు. పాకిస్తాన్ క్రికెటర్లు రిటైరైన తర్వాత కూడా తమ నిర్ణయాలను మార్చుకుంటుంటారని, అభిమానులు ఇంకా ఆడమని చెబుతున్నారనే సాకుతో రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటారని వ్యాఖ్యానించారు.
ఇది కూడా అలాంటిదేనని, 15వ తేదీలోపు అలాంటిది ఏదైనా జరగవచ్చని గవాస్కర్ చెప్పారు. తనకు తెలిసినంత వరకు భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కు ఎటువంటి ఇబ్బంది లేదని వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నానని పేర్కొన్నారు. భారత్‌తో మ్యాచ్ ఆడకుండా పాకిస్తాన్ తన నిర్ణయాన్ని కొనసాగిస్తే ఐసీసీ నుండి ఆంక్షలు, జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గవాస్కర్ హెచ్చరించారు.
భారత్‌తో జరిగే పెద్ద మ్యాచ్ నుండి వైదొలగడానికి పాకిస్తాన్‌కు సరైన కారణం లేకపోయినా లేదా ఒప్పందాన్ని ఉల్లంఘించినా.. దానికి సరైన ఆధారాలు చూపలేకపోతే, ఐసీసీ బోర్డు చర్యలు తీసుకుంటుందని గవాస్కర్ పేర్కొన్నారు. ఇదే అంశంపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాట్లాడారు. భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్తాన్ బహిష్కరించడం ఐసీసీ ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. ఇలా చేయకుండా గట్టి చర్యలు తీసుకోవడానికి ఐసీసీకి పూర్తిగా అర్హత ఉందని అన్నారు.
వివిధ కారణాల వల్ల భారత్, పాకిస్తాన్ రెండు దేశాలు కూడా పరస్పరం ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటానికి ఆయా దేశాలకు వెళ్లేవి కావని, ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ వచ్చిందని హర్భజన్ అన్నారు. ఇది వచ్చిన తర్వాత తటస్థ వేదికలపై మ్యాచ్ లను ఆడటానికి ఎటువంటి సమస్యా లేదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications