WTC Final: రసవత్తరంగా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు- భారత్ కు బెర్త్ దక్కాలంటే?
మెల్ బోర్న్ టెస్టులో 184 పరుగులతో టీమిండియా ఓటమి పాలవ్వడం డబుల్ స్ట్రోక్ గా మారింది. ఈ టెస్టులో ఓటమితో ఆస్ట్రేలియాకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆధిక్యం సమర్పించుకోవడం ఓ దెబ్బ అయితే.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలపై నీళ్ళు చల్లడం మరో దెబ్బగా మారింది. మరోవైపు దక్షిణాఫ్రికా-పాకిస్తాన్ టెస్టు సిరీస్, త్వరలో శ్రీలంకలో జరిగే ఆస్ట్రేలియా టూర్ ఫలితాలు కూడా కీలకంగా మారాయి. దీంతో ఇప్పుడు సిడ్నీ టెస్టు కచ్చితంగా గెలిస్తేనే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ పై భారత్ ఆశలు పెట్టుకోవచ్చు.
డబ్ల్యూటీసీ పైనల్
తాజాగా సెంచురియన్ టెస్టులో పాకిస్తాన్ లో రెండు వికెట్లతో గెలిచిన దక్షిణాఫ్రికా ఈ ఏడాది జూన్ లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తమ స్థానాన్ని ఖరారు చేసుకుంది. అదే సమయంలో మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియా గెలుపు ఆ జట్టును రెండో స్ధానానికి చేర్చింది. దీంతో మూడో స్ధానంలో ఉన్న భారత్, ఐదో స్ధానంలో ఉన్న శ్రీలంక డబ్ల్యూటీసీ పైనల్ రేసులో నిలిచేందుకు శ్రమించాల్సిన పరిస్ధితి.

ఆస్ట్రేలియా పరిస్ధితి ఏంటి?
ప్రస్తుతం 61.46 పాయింట్లతో ఉన్న ఆస్ట్రేలియా సిడ్నీలో భారత్ తో జరిగే మ్యాచ్ తో పాటు శ్రీలంకలో జరిగే రెండు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఇందులో సిడ్నీలో ఓడితే మాత్రం ఆస్ట్రేలియా ఆశలు గల్లంతవుతాయి. అలాగే ఆసీస్, శ్రీలంకతో సంబంధం లేకుండా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుతుంది. అలాగే ఆస్ట్రేలియా సిడ్నీలో గెలిచి శ్రీలంకలో రెండు టెస్టులు ఓడినా 57.02 పాయింట్లతో భారత్, శ్రీలంకను వెనక్కి నెట్టి ఫైనల్ కు చేరడం ఖాయం. సిడ్నీలో డ్రా అయినా ఆసీస్ పాయింట్ల పట్టికలో స్ధానం కాపాడుకుంటుంది. ఒకవేళ ఆస్ట్రేలియా సిడ్నీలో డ్రా చేసుకుని శ్రీలంకలో రెండు టెస్టులు ఓడితే మాత్రం శ్రీలంక ఫైనల్ కు చేరుతుంది. అలాగే సిడ్నీలో ఓడినా శ్రీలంకలో ఒక్క టెస్టు గెలిచినా ఆసీస్ కు ఫైనల్ బెర్తు ఖాయం.
భారత్ లెక్క ఇదే ?
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 52.78 పాయింట్లతో ఉన్న భారత్ కు ఆసీస్ తో సిడ్నీ టెస్టు మాత్రమే మిగిలుంది. కాబట్టి డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే మాత్రం సిడ్నీలో కచ్చితంగా గెలవాలి. సిడ్నీలో గెలిస్తే భారత్ 55.26 పాయింట్లకు చేరుతుంది. అప్పుడు శ్రీలంకలో ఆస్ట్రేలియా రెండు టెస్టులు డ్రా చేసుకుంటే భారత్ తో దాదాపు సమం అవుతుంది. సిడ్నీ టెస్టు డ్రా చేసుకుంటే మాత్రం భారత్ ఫైనల్ రేసు నుంచి నిష్కృమించడం ఖాయం.
శ్రీలంక సంగతేంటి ?
ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో 45.45 పాయింట్లతో ఉన్న శ్రీలంక ఆస్ట్రేలియాతో స్వదేశంలో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. భారత్ తో సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసి ఆ తర్వాత ఆస్ట్రేలియాను 2-0తో ఓడిస్తే శ్రీలంక ఫైనల్ కు చేరే అవకాశాలున్నాయి.సిడ్నీలో భారత్ గెలిస్తే మాత్రం శ్రీలంకకు ఫైనల్ అవకాశాలు ఉండవు. అయితే భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ బెర్తు పోటీ ఉంటుంది.












Click it and Unblock the Notifications