వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. గంభీర్ ప్లాన్ ఇదేనా?
చిన్న వయస్సులోనే తన అసాధారణ టాలెంట్‌తో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీకి, భారత టీ20 జట్టులో క్రమం తప్పకుండా స్థానం సంపాదించడం ఓ పెద్ద సవాలుగా మారింది. కేవలం మరో ప్రతిభావంతుడైన బ్యాటర్‌ను జట్టులోకి తీసుకోవడం కోసం మాత్రమే ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్ కాంబినేషన్‌ను జట్టు యాజమాన్యం మార్చకూడదని భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టులో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనర్లుగా తమ స్థానాలను పటిష్టం చేసుకోగా.. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా రేసులో గట్టి పోటీని ఇస్తున్నారు. ఇన్ని ప్రత్యామ్నాయాల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో స్థిరమైన అవకాశం కోసం కొంతకాలం వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఓ ఆటగాడు అందుబాటులో ఉన్నాడనే కారణంతో మార్పులు చేయడం కంటే వారి పాత్రలపై ప్లేయర్లతో యాజమాన్యం స్పష్టంగా, నిజాయితీగా మాట్లాడాలని మురళీ కార్తీక్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ పరిస్థితిని యశస్వి జైస్వాల్‌తో ఆయన పోల్చారు. అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యం ఉన్నప్పటికీ పరిమిత ఓవర్ల క్రికెట్లో యశస్వి జైస్వాల్ కూడా కొద్దిపాటి అవకాశాలకే పరిమితం కావాల్సి వచ్చిందని గుర్తుచేశారు. "ఒకవేళ మీరు వారికి కఠినమైన నిజం చెప్పాల్సి వచ్చినా, అది స్పష్టంగా చెప్పడమే శ్రేయస్కరం. అది కొంతకాలం జీర్ణించుకోవడం కష్టంగా అనిపించినా, ఉన్న నిజాన్ని అంగీకరించి ముందుకు సాగాల్సిందే" అని మురళీ కార్తీక్ పేర్కొన్నారు.
ఈ నిర్ణయంతో ఇప్పుడు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, జట్టు సెలెక్షన్ ప్రణాళికలపై అందరి దృష్టి నెలకొంది. ఇప్పటికే జట్టులోని టాపార్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్న వేళ టీ20 ఫార్మాట్లో స్థిరమైన కాంబినేషన్‌ను కొనసాగిస్తూనే యువ ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వడం జట్టు యాజమాన్యానికి కత్తిమీద సాములా మారింది. ఇక్క వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై ఎలాంటి అనుమానం లేనప్పటికీ.. పోటీ ఎక్కువగా ఉన్న బ్యాటింగ్ ఆర్డర్‌లో స్థానం దక్కించుకోవడమే అసలైన సవాలుగా మారింది. లభించే కొద్దిపాటి అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఆయన సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది.














Click it and Unblock the Notifications
