ముంచెత్తిన వాన: నాలుగేళ్ల నిరీక్షణ నీటిపాలు!
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరి టీ20 మ్యాచ్ భారత అభిమానులకు ఎంతో కీలకంగా మారింది. ఓ వైపు ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవడమే కాకుండా స్వదేశంలో వరుసగా 13వ టీ20 సిరీస్ విజయాన్ని నమోదు చేయాలని భారత్ భావించింది. మరోవైపు దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా స్టార్ స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి జట్టులోకి అడుగుపెట్టే అవకాశం లభించింది. అయితే ప్రకృతి సహకరించకపోవడంతో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయి.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చూడాలనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది.
భువనేశ్వర్ కుమార్ను తుది జట్టులోకి తీసుకురావడానికి జట్టు యాజమాన్యం, సెలెక్టర్లు ప్రతి సాధ్యమైన ప్రయత్నం చేశారు. అర్ష్దీప్ సింగ్ గాయపడటంతో భువీకి జట్టులో చోటు దక్కింది. ఆ తర్వాత మ్యాచ్ సమయానికి అర్ష్దీప్ సింగ్ కోలుకున్నప్పటికీ.. కెప్టెన్, కోచ్ భువీపై నమ్మకంతో అతడిని ప్లేయింగ్ ఎలెవన్లో కొనసాగించారు. దీని కోసం యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్తో పాటు జట్టు బ్యాలెన్స్ కోసం నితీష్ కుమార్ రెడ్డిని కూడా పక్కనబెట్టి శివం దూబేను రేసులోకి తెచ్చారు. ఏళ్ల తరబడి భువీ పడిన కష్టానికి ఫలితం దక్కే క్షణం వద్దే వర్షం నీళ్లు చల్లింది.

ఈ మ్యాచ్లో అదృష్టం కూడా భువనేశ్వర్ కుమార్కు కలిసిరాలేదు. వర్షం కారణంగా మ్యాచ్ను 9 ఓవర్లకు కుదించినప్పుడు భారత్ ముందుగా బౌలింగ్ చేస్తే భువీ కొత్త బంతితో మెరిసే అవకాశం ఉండేది. కానీ టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్ ముగియడానికి మరో 8 బంతులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో మళ్లీ వర్షం ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్లో కనీసం 5 ఓవర్ల ఆట సాగినా భువీ ఓవర్ వేసే అవకాశం వచ్చేది. కానీ అది కూడా సాధ్యపడలేదు. దీంతో భువనేశ్వర్ కుమార్ అసలైన రీఎంట్రీ ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటనలోనే సాధ్యమయ్యేలా కనిపిస్తోంది.
చిన్నస్వామి స్టేడియంలో వర్షం పడటంతో భువీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ బాధను వ్యక్తం చేశారు. భువనేశ్వర్ తన టీ20 అరంగేట్రం కూడా ఈ స్టేడియంలోనే చేశాడని, నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇక్కడే రీ-ఎంట్రీ చేసే అర్హత అతనికి ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు. వర్షం, డీఎల్ఎస్ పద్దతి వల్ల ఓ మంచి మ్యాచ్, భువీ రీ-ఎంట్రీ పాడైపోవడం పట్ల క్రికెట్ ప్రేమికులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications
