ఆరో గేర్‌లో బాదుతాడు.. కానీ ఐస్‌క్రీం వద్దే ఆగిపోతాడు!
ఐపీఎల్ 2026 సీజన్ కౌంట్‌డౌన్ కొనసాగుతున్న వేళ ప్రస్తుతం అందరి దృష్టి భారత యువ సెన్సేషన్, 15 ఏళ్ల యువ కెరటం వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న తరుణంలో ఈ యువ ఆటగాడిపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో తన మెరుపు బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఈ యువ ఆటగాడి గురించి ఆర్సీబీ ఆటగాడు జితేష్ శర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి.
ప్రపంచాన్ని ఏలుతాడు.. కానీ ప్రొఫెషనల్ కాలేడు!
గతేడాది ఏసీసీ మెన్స్ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో ఇండియా-ఏ జట్టుకు కెప్టెన్‌గా జితేష్ శర్మ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ ప్రవర్తనపై జితేష్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. "వైభవ్ సూర్యవంశీ ప్రపంచ క్రికెట్‌ను ఏలే సత్తా ఉన్నా ఆటగాడు. వైభవ్ బ్యాటింగ్‌లో ఆరో గేర్ ఉంటుంది. కానీ అతను ప్రొఫెషనల్ కాదు. మేము అతడిని క్రమశిక్షణ గల ఆటగాడిగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ వైభవ్ పూర్తిగా మారతాడని నేను అనుకోవడం లేదు" అని జితేష్ శర్మ పేర్కొన్నాడు.

స్టేడియంలో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడతాడని.. అయితే స్టేడియం బయట అతడి ప్రవర్తన ప్రొఫెషనల్ ఆటగాడిగా ఉండదని జితేష్ శర్మ అభిప్రాయపడ్డాడు. వైభవ్ రాత్రిపూట ఐస్‌క్రీమ్ తినకుండా ఉండాలని కూడా నేను సలహా ఇవ్వాల్సి వస్తోందని జితేష్ నవ్వుతూనే తన ఆందోళనను వ్యక్తం చేశాడు.
ఆకాశానికెత్తిన ఏబీ డివిలియర్స్
జితేష్ శర్మ చేసిన కామెంట్లకు విరుద్ధంగా దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ భారత యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో వైభవ్ ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తూ.. ఇంత చిన్న వయస్సులోనే అంతటి పరిణతి చూపించడం అసాధారణమని డివిలియర్స్ కొనియాడారు. వైభవ్ సూర్యవంశీ చాలా ప్రొఫెషనల్ అని ఏబీడీ కితాబిచ్చారు. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ కేవలం 35 బంతుల్లోనే శతకం బాది చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ఈసారి కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ బౌలర్లు వైభవ్ బలహీనతలపై దృష్టి పెట్టారు. కేవలం ఓ సంచలనంగా మిగిలిపోతాడా లేదా సుదీర్ఘకాలం క్రికెట్‌ను ఏలుతాడా అనేది ఈ సీజన్ తేల్చనుంది.












Click it and Unblock the Notifications