కన్నీటితో స్వదేశాగమనం: అలా వెంటాడింది..
Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్.. స్వదేశానికి తిరిగి వచ్చారు. కొద్దిసేపటి కిందటే దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. అక్కడ ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా సహా పలువురు అథ్లెట్లు ఆమెకు స్వాగతం పలికారు.
మహిళల 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో వినేష్ ఫొగట్ ఫైనల్స్ వరకు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. తుదిపోరులో అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్‌ను ఢీ కొట్టాల్సి ఉండగా.. బౌట్ ఆరంభానికి కొన్ని గంటల ముందు డిస్ క్వాలిఫై అయ్యారు. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఫొగట్ అనర్హత వేటుకు గురయ్యారు. ఫలితంగా ఒక్క పతకం కూడా దక్కించుకోలేకపోయారు.

నిజానికి ఫైనల్స్‌లో ఓడిపోయినా కూడా రజత పతకం ఖాయం అయ్యేదే. శరీర అదిక బరువు కారణంగా ఒలింపిక్స్ గేమ్స్ నుంచే వైదొలగాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారామె. ఇప్పుడు ఖాళీ చేతులతో స్వదేశానికి రావాల్సి వచ్చింది.
తనపై పడిన అనర్హత వేటుపై వినేష్ ఫొగట్ న్యాయపోరాటం చేశారు. ఆమె తరఫున భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అడ్‌హక్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌ను ఆశ్రయించింది. ఈ కేసును వాదించడానికి సీనియర్ అడ్వొకేట్, మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే, మరో న్యాయవాది విదూష్ పత్ సింఘానియాను అపాయింట్ చేసింది.
వీడియో కాన్ఫరెన్స్ వినేష్ ఫొగట్, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రతినిధులు ఈ విచారణకు హాజరయ్యారు. వారి వాదనలను స్పోర్ట్స్ ఆర్బిట్రేటర్ డాక్టర్ అన్నాబెల్లె బెన్నెట్ ఆలకించారు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ విధి విధానాలు, నిబంధనలను పరిశీలించారు. అనర్హత నిర్ణయాన్ని సమర్థించారు. దీనితో కోర్టులో కూడా ఆమెకు ఊరట లభించలేదు.
ఈ పరిస్థితులపై వినేష్ ఫొగట్ స్పందించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడారు. బాధతో కన్నీరు పెట్టుకున్నారు. తన పోరాటంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత తెలుపుకొంటున్నాని అన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో దురదృష్టం తనను వెంటాడిందని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications