రో-కో 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా?: బీసీసీఐ చీఫ్ షాకింగ్ కామెంట్స్!
2027లో జరగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారా లేదా అనే అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 2027 ప్రపంచ కప్ కోసం భారత్ సిద్ధం చేసే ప్రణాళికల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల సెలెక్షన్ అనేది వారి వయస్సు ఆధారంగా కాకుండా ఫార్మాట్‌కు తగ్గ ఫిట్నెస్, ఆటతీరు ఆధారంగానే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్లేయర్లను కేవలం వయస్సు ఆధారంగా అంచనా వేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఓ ఇంటర్వ్యూలో మిథున్ మన్హాస్ మాట్లాడుతూ.. "భారత జట్టు సెలక్షన్ అనేది పూర్తిగా సెలక్టర్లు, హెడ్ కోచ్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఓ ఆటగాడు ఆడేందుకు పూర్తి ఫిట్‌గా ఉండి జట్టుకు విజయాలు అందిస్తున్నప్పుడు వయస్సును పరిగణనలోకి తీసుకోకూడదు. నా దృష్టిలో సెలక్షన్‌కు ఫిట్నెస్, ప్రదర్శన మాత్రమే ప్రధాన ప్రమాణాలు కావాలి. జట్టులో ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ సీనియర్ ఆటగాళ్ల అనుభవం ఎంతో కీలకమవుతుంది" అని మిథున్ మన్హాస్ పేర్కొన్నారు.

యువ కెప్టెన్‌కు సీనియర్ల మద్దతు అవసరం
రాబోయే వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టుకు నాయకత్వం వహించే దిశగా రూపుదిద్దుకుంటున్న యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను గైడ్ చేయడంలో సీనియర్ల పాత్ర మిథున్ మన్హాస్ ప్రముఖంగా ప్రస్తావించారు. జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా లాంటి అనుభవజ్ఞులు ఉండటం గిల్‌కు కెప్టెన్సీ భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని చెప్పారు. మ్యాచ్ క్లిష్ట సమయాల్లో ఈ సీనియర్లు ఇచ్చే సలహాలు విజయానికి దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఉన్న బిజీ అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్, ఆటగాళ్ల గాయాల సమస్యలను అధిగమించడానికి బెంచ్ బలాన్ని సిద్ధం చేయడం అవసరమని మిథున్ మన్హాస్ వెల్లడించారు. "భారత క్రికెట్లో తీవ్రమైన పోటీ ఉండటం చాలా మంచి పరిణామం. పోటీ ఉన్నప్పుడే ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రోత్సహించబడతారు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్, ఆటగాళ్ల రికవరీ సమయాల మధ్య సరైన సమతుల్యత పాటించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రూపొందిస్తోంది" అని మిథున్ మన్హాస్ ముగించారు.














Click it and Unblock the Notifications
