World Cup 2023: భారత్-కివీస్ సెమీఫైనల్ గెలిచేదెవరంటే ? ఆ రెండే కీలకమనే అంచనా !
రేపు భారత్-కివీస్ జట్ల మధ్య వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ కు ఆతిధ్యమిచ్చేందుకు ముంబైలోని వాంఖడే స్టేడియం సిద్ధమవుతోంది. వరల్డ్ కప్ లో వరుసగా 9 మ్యాచ్ లు గెలిచి సెమీస్ కు దూసుకొచ్చిన భారత్ ఓవైపు...మరో వైపు లీగ్ దశను ఘనంగా ఆరంభించి మధ్యలో టీమిండియా చేతిలో ఓడాక ఎదురైన షాక్ నుంచి కోలుకుని సెమీస్ కు అర్హత సాధించిన కివీస్ మరోవైపు మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి సెమీస్ విజేతపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
భారత్-న్యూజీలాండ్ జట్ల మధ్య రేపు జరిగే తొలి సెమీఫైనల్లో గెలిచేదెవరన్న చర్చకు మెజారిటీ జనం రోహిత్ సేనవైపే మొగ్గు చూపుతున్నారు. మరికొందరు మాత్రం భారత్ కన్నా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే కివీస్ కే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే స్వదేశంలో ఆడుతుండటం, వరుస విజయాలతో ఫామ్ లో ఉండటం వంటి అంశాలతో భారత్ కే ఎక్కువగా మొగ్గు కనిపిస్తోంది. ఈ క్రమంలో మ్యాచ్ కు ఆతిధ్యమిస్తున్న వాంఖడే స్టేడియం పిచ్, ఇతరత్రా పరిస్ధితులు కూడా కీలకంగా మారబోతున్నాయి.

భారత్-కివీస్ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తున్న వాంఖడే స్టేడియంలో తాజాగా జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లను గమనిస్తే రేపటి మ్యాచ్ లో ఏం జరుగుతుందో ఇట్టే ఊహించవచ్చని క్రికెట్ నిపుణులు, పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన చూస్తే టాస్ గెలిచిన జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. టాస్ గెలిచిన జట్టు కచ్చితంగా ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాంఖడే పిచ్ పై ఫ్లడ్ లైట్లలో ఛేజింగ్ కష్టసాధ్యమని చెబుతున్నారు.
వాంఖడే స్టేడియంలో గతంలో సెమీ ఫైనల్స్ లో గెలిచిన చరిత్ర లేకపోయినా భారత్ రేపు టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లేనని క్రికెట్ నిపుణలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తే 340 పరుగుల వరకూ చేయాలని, అలాగే బౌలింగ్ లో తొలి పవర్ ప్లే లోనే మూడు వికెట్లు తీస్తే ఇక మ్యాచ్ గెలిచినట్లేనని క్రికెట్ వ్యాఖ్యాత హర్షాభోగ్లే తాజాగా అంచనా వేశాడు. అలాగే తొలి బ్యాటింగ్ కు పరిస్ధితులు అనుకూలంగా ఉంటాయని చెబుతున్నాడు.












Click it and Unblock the Notifications