• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పార్వతి డిప్యూటీ సిఎం అయ్యేవారే!

By Staff
|
హైదరాబాద్‌ః వరుసగా ఆరేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్‌ ను పరిపాలించిన రెండో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ రోజు చరిత్రపుటలకు ఎక్కారు. 1995 సెప్టెంబర్‌ ఒకటిన ఆయన ఎన్టీఆర్‌ పై తిరుగుబాటు చేసి అధికారం చేపట్టిన విషయం విదితమే. గతంలో కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీఆర్‌ రాష్ట్రాన్ని ఎక్కువకాలం పరిపాలించిన ముఖ్యమంత్రులుగా రికార్డులకు ఎక్కారు. అయితే ఆగస్టు సంక్షోభం కారణంగా నెల రోజుల పాటు అధికారాన్ని కోల్పోయిన ఎన్టీఆర్‌ రాష్ట్రాన్ని నిరవధికంగా ఆరేళ్ళు పాలించిన వ్యక్తిగా రికార్డు సాధించలేకపోయారు.

రాష్ట్రాన్ని నిరవధికంగా పాలించడంతో పాటు దేశవిదేశాల్లో ఐ.టి. బాబుగా మంచి పేరుతెచ్చుకున్న చంద్రబాబు గత వారం రోజులుగా ఆత్మపరిశీలనలో పడ్డారు. ఆరు రోజులుగా వివిధ జిల్లాల నేతలతో చంద్రబాబు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఎప్పుడూ ఎదుటివారు నోరెత్తి మాట్లాడే అవకాశం ఇవ్వని చంద్రబాబు ఒక్కసారి ఆ అవకాశం ఇచ్చి చేతులు కాల్చుకున్నారు. జిల్లాల్లో పార్టీ పరిస్థితి గురించి, పార్టీని బలోపేతం చేసేందుకు తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా చంద్రబాబు జిల్లా నేతల్ని కోరారు.

మండల, పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేక పోయింది. పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పేరుకుపోయినందువల్లే ఇలా జరిగిందని గ్రహించిన చంద్రబాబు వారిలో గూడుకట్టుకుపోయిన అసంతృప్తిని బయటకు రాబట్టి కాయకల్ప చికిత్స చేయాలని ఆలోచించారు. చంద్రబాబు పాచిక కొంతవరకు బాగానే పారింది. జిల్లాలకు చెందిన నేతలు నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఏం చేస్తే పార్టీ పదికాలాల పాటు బతికి పట్టకడుతుందో కరాఖండిగా చెప్పారు. జిల్లా నేతల అభిప్రాయాలు విన్న చంద్రబాబు తల తిరిగిపోయింది.

అధికారం అంతా మీ దగ్గరే పెట్టుకుంటే జిల్లా నేతలంతా డమ్మీలైపోతున్నారనేది ఎమ్మెల్ల్యేలు బాబుపై సంధించిన మొదటి బాణం. కరవు, రైతు సమస్యలు, పెండింగ్‌ ప్రాజెక్టులు పట్టించుకోకుండా ఐ.టి. మంత్రం జపిస్తే ఈ సారి ఎన్నికల్లో మరింత ఎదురుదెబ్బ తప్పదనేది రెండో బాణం. ఇలా ఒకటి తరువాత ఒకటిగా జిల్లా నేతలు అస్త్రాలు సంధించే సరికి చంద్రబాబు దిమ్మెరపోయారు. కాస్త అలుసు ఇచ్చే సరికి ఇలా నెత్తికి ఎక్కి కూర్చుంటారా అంటూ ఓ దశలో చంద్రబాబు జిల్లా నేతలను మందలించినంత పనిచేశారు. జిల్లాలో వున్న వాస్తవ పరిస్థితులను వివరించమన్నారు... వివరించాం... ఆపైన మీ ఇష్టం అంటూ వారు ఆ క్షణం నుంచి మౌనం వహించారట.

మండల, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకోవడంతో బాబు చాలా ఆలోచనలో పడ్డారు. పార్టీ జిల్లా నేతలను హద్దుల్లో వుండండని దబాయించినా వారి మాటల్లో సత్యాన్ని చంద్రబాబు తప్పక గ్రహించే వుంటారు. రాష్ట్రాన్ని నిరవధికంగా ఆరేళ్ళ పాలించిన ఘనత వహించిన చంద్రబాబు మరింతకాలం రాష్ట్రాన్ని పాలించాలంటే జిల్లా నేతల సలహాలు పాటించక తప్పదేమో?!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X