రాష్ట్రపతి పాలన... ఆంధ్రకు వ్యతిరేకం, తెలంగాణకు అనుకూలమా?

రాష్ట్ర విభజనకు కేంద్రం ప్రతిపాదన నేపథ్యంలో ఇప్పటిదాకా ఎమ్మెల్యేలకే పరిమితమైన రాజీనామాలు ఇప్పుడు మంత్రుల నోటా వినిపిస్తున్నాయి. తామూ పదవులకు గుడ్‌బై చెబుతామని కోస్తాంధ్ర, రాయలసీమ మంత్రులు శనివారం హెచ్చరించారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కాస్త రాజ్యాంగ సంక్షోభంగా మారే సంకేతాలు కనిస్తున్నాయి. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతల నుంచి వైదొలగడం సముచితం కాదని రోశయ్య సర్దిచెప్పడంతో మంత్రులు కాస్త నెమ్మదించారు. కానీ రోశయ్య కూడా జరుగుతున్న పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష ప్రకటనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ముఖ్యమంత్రిగా నిన్నటితో వంద రోజులు పూర్తి చేసుకున్నా ఆయనలో ఆ ఆనందం కన్పించడం లేదు. ఈ వంద రోజుల్లో ఆయనకు అనేక పెను సమస్యలు ఎదురయ్యాయి. ఏఐసీసీ కార్యదర్శి కె.కేశవరావు 'తెలంగాణపై వారం రోజుల తర్వాతే మాట్లాడతా'నంటూ కొత్త ఉత్కంఠకు తెరతీశారు. 'సోమవారం వరకు చూస్తాం. రాజీనామా చేసిన కోస్తా, సీమ నేతలను రాజీకి రప్పించాల్సిందే. లేకుంటే... తదుపరి కార్యాచరణకు దిగుతాం' అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
రాజీనామాలపై కోస్తా, సీమ నేతలు రాజీ పడకపోతే రాష్ట్రపతి పాలన విధించడం మినహా కేంద్రానికి మరో మార్గం ఉండకపోవచ్చు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను దారికి తెచ్చేందుకు కాంగ్రెస్ కూడా ఇదే అస్త్రం ప్రయోగించాలని భావిస్తోంది. క్రమశిక్షణ పాటించకపోతే రాష్ట్రపతి పాలన విధించేందుకైనా సిద్ధమని కోస్తా, సీమ నేతలను హెచ్చరించే అవకాశం కనిపిస్తోంది.
ప్రాంతీయ భావోద్వేగాలతో తిరుగుబాటు చేసిన నేతలపై ఇప్పటిదాకా చూసీచూడనట్టు వ్యవహరించిన కాంగ్రెస్ కోర్‌కమిటీ సోమవారం సమావేశమై, 'రాష్ట్రపతి పాలన' సంకేతాలు పంపనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీరు దారికొస్తారా; లేదా అనేది సస్పెన్స్! గెలిచి ఏడునెలలు కూడా పూర్తి కాని పరిస్థితిలో, మళ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు ప్రజా ప్రతినిధులు ఎంతవరకు సిద్ధపడతారన్నది అసలు ప్రశ్న!. సీమాంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలను దారికి తేవడానికే రాష్ట్రపతి పాలన విధిస్తామన్న కొరడాను చూపించాలన్నది కేంద్ర వ్యూహం కావచ్చు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసుకుని గెలిచి, ఏడు నెలలు తిరగకముందే పదవులు వదులుకోడానికి ఆ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండరు. సోమవారం రాత్రికి కొంత స్పష్టత వచ్చే అవకాశముంది.