హైదరాబాద్ పేచీ: కెసిఆర్ వ్యూహం

శ్రీకృష్ణ కమిటీ నివేదికలో హైదరాబాదు ఓ ప్రధానాంశంగా మారే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే డిమాండ్ కూడా బలంగా ఉంది. అయితే, తెలంగాణ నాయకులు, మేధావులు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాదు తెలంగాణలో వందలాది ఏళ్లుగా భాగమని, దాన్ని చారిత్రకంగా, సామాజికంగా తెలంగాణ నుంచి వేరు చేయడం కుదరదని, హైదరాబాదు తెలంగాణకు తల లాంటిదని, తల లేని మొండెం ఉండదని వారంటున్నారు. ఈ స్థితిలో సీమాంధ్ర నాయకుల అభిప్రాయాన్ని పసిగట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తనదైన వ్యూహరచన చేసి దాన్ని అమలులో పెడుతున్నారు. సీమాంధ్ర నాయకులు హైదరాబాదులో ఉండడం సాధ్యం కాదని అనుకునేలా కార్యక్రమాలను చేపడుతున్నారు.
హైదరాబాదు, హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో కార్యక్రమాలను ఉధృతం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మాత్రమే కాకుండా రాష్ట్ర హైకోర్టును కూడా దానికి కేంద్రంగా మార్చారు. సీమాంధ్ర వర్గాలు హైదరాబాదు కూడా తమది కాదని, ఇక్కడ ఉండడం సాధ్యం కాదని అనుకునే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్తిగా తెలంగాణ ఆందోళనకు కేంద్రంగా మారింది. న్యాయవాదులు కూడా హైదరాబాదులోని హైకోర్టును తెలంగాణ ఉద్యమానికి ఒక కేంద్రంగా మార్చారు. సీమాంధ్రకు చెందిన హైదరాబాదులోని కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు దాదాపుగా కెసిఆర్ చెప్పుచేతల్లోకి వచ్చినట్లు భావిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేని పారిశ్రామికవేత్తలు, సంస్థల యాజమాన్యాలు కూడా ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం. కేవలం సీమాంధ్రకు చెందన పారిశ్రామికవేత్తలైన రాజకీయ నాయకులతోనే కెసిఆర్ కు సమస్యగా ఉంది. దీంతో సీమాంధ్ర రాజకీయ నాయకుల గొంతు మైనారిటీలో పడేలా ఆయన వ్యవహరిస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చేలోగా హైదరాబాదుపై తన పట్టు సాధించాలనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications