రాష్ట్రపతి పాలన దిశగా రాష్ట్రం?

రాష్ట్ర పరిస్థితిపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిక సమర్పిస్తున్నారు. నిఘా విభాగాలు కూడా క్రమం తప్పకుండా కేంద్రానికి నివేదికలు సమర్పిస్తూనే ఉన్నాయి. కమిటీ నివేదిక రాక ముందు నుంచే రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. కమిటీ నివేదిక సూచన ఏదైనా రాష్ట్రం పూర్తిగా అల్లకల్లోలంగా మారే సూచనలున్నాయని అంటున్నారు. కమిటీ సూచనను బట్టి సీమాంధ్రలోనో, తెలంగాణలోనో తీవ్రమైన ఆందోళనలు చెలరేగవచ్చునని అంచనాలు వేస్తున్నారు.
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వరంగల్ జిల్లా ఓదార్పు యాత్రను అడ్డుకోవడం నుంచి మొదలు పెడితే తాజాగా మంత్రి శిల్పా మోహన్ రెడ్డిపై కరీంనగర్ జిల్లాలో రాళ్లదాడి జరగడం వరకు అన్నీ కేంద్ర ప్రభుత్వ దృష్టికి వెంటవెంటనే వెళ్తున్నట్లు చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై దాడి, ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష గందరగోళం, తెలంగాణ న్యాయవాదుల ఆందోళన వంటి అన్ని పరిస్థితులను కేంద్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెసు పార్టీ అధిష్టానం జాగ్రత్తగా గమనిస్తున్నట్లు చెబుతున్నారు. పరిస్థితిని అదుపులో ఉంచుకోవడానికి శ్రీకృష్ణ కమిటీ నివేదిక అందడానికి ముందే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications