కుటుంబానికి ఎన్టీఆర్ పేరు ఇప్పటికీ పెద్ద ఆస్ధి!

రచయితగా కొత్త అవతారమెత్తిన ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటీ వెంకటేశ్వరరావు తన ఆంగ్ల పుస్తకం "ది అదర్ సైడ్ ఆఫ్ ది ట్రూత్" పుస్తకాన్ని ఈరోజు ఎన్టీఆర్ సమాధి ముందే ఆవిష్కరింపజేసుకున్నారు. ఎవరూ దొరకనట్టు ఆయన తన భార్య పురందేశ్వరి కరకమలాలతో పుస్తకాన్ని ఆవిష్కరింపజేసుకున్నారు. భార్యను గౌరవించే ఉత్తమ భర్తల జాబితాలో ఆయన చేరిపోయారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను ఎలా వెన్నుపోటు పొడిచిందీ, టిడిపి చరత్రకు సంబంధించిన కొన్ని వివరాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. నిరుడు విడుదల చేసిన తెలుగుపుస్తకానికి ఇది ఆంగ్లానువాదం.
ఇందులో ఉన్నవి నిజంకాకపోతే ముందుకొచ్చి చెప్పమని దగ్గుబాటి సవాల్ చేశారు. చంద్రబాబు నూరు తప్పులు, డజను ద్రోహాలు చేసి ఉండవచ్చు. కానీ దగ్గుబాటి పూర్తిగా పత్తిత్తా? ఆనాడు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా, చంద్రబాబుకు మద్దతుగా ఆయన వైస్రాయ్ హోటల్ కు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది. భార్యా విధేయుడైన ఆయన పురందేశ్వరి అనుమతి లేకుండానే "ఆపరేషన్ వైస్రాయ్" లో పాల్గొన్నారా? దగ్గుబాటిని ఉప ముఖ్యమంత్రిని చేసి ఉంటే ఆ దంపతులు కాంగ్రెస్ లోకి వెళ్ళిఉండేవారా? ఈ పుస్తకం వచ్చి ఉండేదా? వీటి మీద చంద్రబాబు కూడా "మరో చరిత్ర" అనే పుస్తకం రాసుకుంటే ఆ కుటుంబం కథ మరింత రక్తి కడుతుంది.
తన తెలుగు పుస్తకం పదివేల కాపీలు అమ్ముడుపోయిందని, రెండో ముద్రణకు వెళ్తున్నామని దగ్గుబాటి ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో చెప్పారు. అదే నిజమైతే ఆయన యండమూరి వంటి పాపులర్ రైటర్స్ ను దాటేసి అగ్రభాగన చేరినట్టే. చంద్రబాబు తనను తెలుగుదేశం లోకి రానివ్వడని ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతే వైఎస్ తమ భార్యభర్తలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని దగ్గుబాటి ఈ చర్చలో ఒప్పుకోవడం మరో హైలైట్.












Click it and Unblock the Notifications