వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై ఆత్మరక్షణలో జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
తెలంగాణపై కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆత్మరక్షణలో పడ్డారు. పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెలుగుదేశం పార్లమెంటు సభ్యులతో చేతులు కలపడం ఆయన ప్రతికూలంగా మారింది. అది మాత్రమే కాకుండా, తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రకటన కూడా ఆయనకు తీవ్ర సమస్యగా మారినట్లే కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో సీమాంధ్రలో వైయస్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆయనకు తీవ్ర ఆటంకాలకు కారణంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణకు, హైదరాబాదుకు వెళ్లడానికి మనం వీసాలు తీసుకోవాల్సి ఉంటుందని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ వ్యాఖ్యానించారు. ఇది అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ప్రస్తుతం అది జగన్ ను ఇబ్బంది పెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

నల్లగొండ జిల్లాలోని భువనగిరి సభలో వైయస్సార్ ని ప్రశంసించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి వేదికపైనే కయ్యానికి దిగారు. సీమాంధ్రలో వైయస్సార్ చేసిన ప్రకటనను మరోసారి గుర్తు చేశారు. వైయస్ తెలంగాణ వ్యతిరేకి అని ఆయన అన్నారు. వైయస్సార్ తెలంగాణ వ్యతిరేకత మళ్లీ మళ్లీ చర్చనీయాంశం కావడానికి వైయస్ జగన్ వర్గీయులే కారణం. కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఏర్పాటు చేస్తున్న త్యాగధనుల సంస్మరణ సభల్లో వైయస్సార్ అభిమానులు రెచ్చిపోతున్నారు. వేదికపై వైయస్సార్ ఫొటో పెట్టాలంటూ గొడవ చేస్తున్నారు. ఈ సమయంలో తెలంగాణకు చెందిన కొంత మంది కాంగ్రెసు నాయకులు వైయస్సార్ తెలంగాణ వ్యతిరేకతపై దుమ్మెత్తిపోస్తున్నారు. అది జగన్ వేసుకున్న వ్యూహానికి ఆటంకంగా మారిందని చెప్పాలి.

తెలంగాణలోని కాంగ్రెసు, ప్రభుత్వ కార్యక్రమాల్లో వైయస్సార్ ఫొటో కోసం గొడవ చేయడం ద్వారా వైయస్ జగన్ ఆశించిన ఫలితం ఉంది. తెలంగాణలోనూ వైయస్సార్ కు ఎడతెగని అభిమానులున్నారని అందరికీ చూపించే ఉద్దేశంతోనే సభల్లో గొడవ చేయిస్తున్నారని అంటున్నారు. వైయస్ వర్గానికి చెందినవారు నోటి మాట ద్వారా వైయస్సార్ కు తెలంగాణలో అభిమానులున్నారని, తెలంగాణలో కూడా వైయస్ జగన్ పర్యటిస్తారని చెబుకుంటున్నారు. గొడవలు వారి మాటలను ధ్రువీకరిస్తాయి. తద్వారా తెలంగాణలో తన పర్యటనకు అనుకూల వాతావరణం ఏర్పరుచుకోవాలనేది వైయస్ జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. పరిణామాలు పూర్తి అనుకూలంగా మారడం లేదు. దీంతో ఆయన ఆత్మరక్షణలో పడ్డారని అనుకోవాలి. వైయస్ జగన్ వర్గానికి చెందిన కొండా సురేఖ, అంబటి రాంబాబు చేసిన ప్రకటనలే అందుకు నిదర్శనం.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రకటనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వారన్నారు. తెలంగాణలో అడుగు పెట్టాలంటే, తెలంగాణలో భూములు కొనాలంటే, విద్యా సంస్థలు పెట్టాలంటే తమ అనుమతి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారని, దాన్ని వ్యంగ్యంగా తిప్పికొట్టడానికే తెలంగాణకు వెళ్లాలంటే వీసాలు తీసుకోవాలని వైయస్సార్ అన్నారని వారు ఆదివారం వివరణ ఇచ్చుకున్నారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తాను కాదని తెలంగాణపై తటస్థ వైఖరి తీసుకుంటూ, వైయస్సార్ అభిమానుల తెలంగాణ ఉన్నారని చాటుతూ తెలంగాణలో ఓదార్పు యాత్రకు సానుకూలం వాతావరణం ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నిస్తున్న వైయస్ జగన్ ప్రస్తుత స్థితిలో అంతగా ఫలితం సాధించే అవకాశాలు లేవు. తెలంగాణవాదులే కాకుండా కాంగ్రెసులోని ప్రత్యర్థులు కూడా ఆయన ప్రయత్నాలను తీవ్రంగా తిప్పికొట్టే వాతావరణమే ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X