తెలంగాణాలో ఎబోలా అలెర్ట్.. మంత్రి కీలక ఆదేశాలు!
తెలంగాణా ప్రభుత్వం ఎబోలా కేసుల విషయంలో అప్రమత్తం అయ్యింది. వివిధ దేశాల నుండి, ముఖ్యంగా ఆఫ్రికా వంటి ఎబోలా కేసులు నమోదవుతున్న దేశాల నుండి ప్రయాణికులు వస్తున్న క్రమంలో ఎబోలాపై అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు ఎబోలా వైరస్ నివారణ, ముందస్తు జాగ్రత్తలు మరియు సన్నద్ధతపై మంత్రి దామోదర్ రాజనర్సింహ తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఎబోలాపై తెలంగాణా ప్రభుత్వం అలెర్ట్ .. ముందస్తు చర్యలు
హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రికి అధికారులు వివరాలు అందజేస్తూ, రాష్ట్రంలో ప్రస్తుతం ఎబోలా సోకిన వారు లేరని, ఎలాంటి అనుమానిత కేసులు కూడా లేవని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

ఎయిర్ పోర్ట్ లలో స్క్రీనింగ్, గాంధీ హాస్పిటల్‌లో 10 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ వంటి ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరినీ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే థర్మల్ స్క్రీనింగ్ చేసి పరిశీలిస్తున్నారు. డాక్టర్లు, హెల్త్ ఇన్‌స్పెక్టర్లు, పారామెడికల్ సిబ్బందితో ప్రత్యేక బృందం విధులు నిర్వహిస్తోంది. గాంధీ హాస్పిటల్‌లో 10 పడకలతో ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. అనుమానితుల సాంపిల్స్‌ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పుణేకు పంపి పరీక్షలు చేయనున్నారు.
వారికి 21 రోజుల పాటు ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్
108 అంబులెన్స్‌లను 24 గంటలూ అందుబాటులో ఉంచుతున్నారు.ఎబోలా వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చిన 58 మంది ప్రయాణికులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నారని, వారందరూ లక్షణాలు లేని కారణంగా Category-I కింద వర్గీకరించి 21 రోజుల పాటు ఇంట్లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచారని అధికారులు తెలిపారు. వీరిపై జిల్లా నిఘా బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాయి.
తెలంగాణాలో ఎబోలా కేసులు నమోదు కాలేదన్న మంత్రి
రాష్ట్రంలో ఎబోలా కేసుల పరిస్థితిపై ఎబోలా వైరస్ కేసులు ఎక్కడా నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న ఏ ఒక్క వ్యక్తిని కూడా ఇప్పటివరకు గుర్తించలేదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని మంత్రి తెలిపారు.
అధికారులకు కీలక సూచనలు చేసిన మంత్రి
ఇదే సమయంలో అధికారులకు కీలక సూచనలు చేశారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా నిరంతరం నిఘా కొనసాగించాలని, లక్షణాలు ఉన్నవారిని వెంటనే గాంధీ హాస్పిటల్‌కు తరలించాలని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని, ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్స్ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. విమానాశ్రయం, జిల్లా బృందాలు, ఆసుపత్రుల మధ్య సమన్వయం బలోపేతం చేయాలని సూచించారు.













Click it and Unblock the Notifications