వడదెబ్బతో ఒక్కరోజే 45మంది మృతి.. నేడు 10జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్!
తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం తీవ్రమైన వేడి, వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పగటి పూట మాత్రమే కాకుండా రాత్రి సమయాల్లో కూడా ఉష్ణోగ్రతలు అసాధారణంగా ఎక్కువగా నమోదవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో కూడా చాలా ఉక్కపోతగా మారడం వల్ల నిద్ర కూడా పోలేని పరిస్థితి సామాన్యులకు ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు 45 మంది ప్రాణాలు గాల్లో
ఇదిలా ఉంటే మంగళవారం ఒక్కరోజు వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 17 మంది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 16 మంది మృతి చెందారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో 5 మంది, కరీంనగర్‌లో 4 మంది, నల్గొండలో ఇద్దరు, మహబూబ్‌నగర్‌లో ఒక్కరు వడదెబ్బకు బలయ్యారు. ఎక్కువగా వృద్ధులు మరియు ఎండలో పని చేసే కార్మికులు ఈ విపత్తుకు గురవుతున్నారు.

ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు
రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఖమ్మంలో 44.8 డిగ్రీలు, భద్రాచలంలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి వేళల్లో కూడా రామగుండంలో 31.4 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 30.2 డిగ్రీలు వంటి అధిక కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
నేడు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
ఈ పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాఖ కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్‌తో సహా 10 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అత్యవసరం లేనిదే ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సలహా ఇచ్చారు.
వడదెబ్బ నివారణకు అవసరమైన ముందు జాగ్రత్తలు
మరోవైపు ప్రభుత్వం ప్రజల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటోంది. వడదెబ్బ నివారణకు అవసరమైన ముందు జాగ్రత్తలు పాటించాలని, నీరు ఎక్కువగా తాగాలని, తలపై తడి గుడ్డ కప్పుకోవాలని, పగటి వేళల్లో ఎండలో బయటకు రాకుండా ఉండాలని ప్రజలను కోరుతోంది. ఈ తీవ్రమైన రాబోయే రోజుల్లో కూడా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ లోని కొన్ని చోట్ల వర్షం
అయితే ప్రజలకు కొన్ని చోట్ల కొంత ఉపశమనం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. గురువారం వరకు ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలలో వర్షం పడింది. ఇది వేడిని కొంతవరకు తగ్గించింది.













Click it and Unblock the Notifications