11 ఏళ్ల తర్వాత పోటీకి స్టార్ హీరోలు... గెలుపు ఎవరిదో ???

తెలుగు చిత్రసీమలో నందమూరి, అక్కినేని కుటుంబాలకు ప్రత్యేక స్థానం ఉంది. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావుల కాలం నుంచే ఈ సంప్రదాయ పోటీ కొనసాగుతోంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ పలుమార్లు బాక్సాఫీసు బరిలో నిలవగా.. చాలాసార్లు ఎన్టీఆర్‌ పైచేయి సాధించారు. అనంతరం వారి నటవారసులుగా నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చి.. అదే తీరున బాక్సాఫీస్ పోటీని కొనసాగిస్తూ సినీ అభిమానులను అలరిస్తున్నారు.

తాజాగా ఈ ఇద్దరు దిగ్గజాలు వచ్చే సంక్రాంతికి మరోసారి తలపడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో సంక్రాంతి రేసులో మూడుసార్లు పోటీపడిన ఈ సీనియర్ హీరోలు, 2027 సంక్రాంతి పండుగకు మళ్లీ బాక్సాఫీస్ బరిలోకి దిగనున్నారనే చర్చ ఫిల్మ్‌నగర్‌లో జోరుగా సాగుతోంది. అక్కినేని నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ చిత్రం 'లాటరీ కింగ్'తో పొంగల్ రేసులో నిలవనున్నారు. అలానే నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ సినిమా కూడా అదే పండగ సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రచారం జరుగుతోంది.

nandamuri-balakrishna-and-king-nagarjuna-going-to-release-their-movies-at-sankranthi-after-11-years

ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్ మాత్రమే కాకుండా, 2027 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబోలో తెరకెక్కనున్న చిత్రం, అలాగే విక్టరీ వెంకటేశ్-అనిల్ రావిపూడిల కాంబినేషన్ మూవీ కూడా థియేటర్లలోకి రానున్నాయని సమాచారం. టాప్ సీనియర్ హీరోలంతా ఒకేసారి బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతుండటంతో, టాలీవుడ్‌లో ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రేజీ 2027 సంక్రాంతి పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారు, బాక్సాఫీస్ రికార్డులను ఎవరు తిరగరాస్తారో చూడాలని సినీ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున మధ్య ఇప్పటివరకు సుమారు పదిసార్లు బాక్సాఫీస్ పోరు జరిగింది. వారి మధ్య తొలిసారిగా పోటీ 1987 సంక్రాంతి రేసులో మొదలైంది. జనవరి 14న బాలయ్య నటించిన 'భార్గవరాముడు', నాగ్ నటించిన 'మజ్ను' చిత్రాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఇందులో 'భార్గవరాముడు' రాయలసీమలో సంచలనం సృష్టించగా, 'మజ్ను' ఆంధ్రా ప్రాంతంలో అద్భుత విజయాన్ని సాధించింది.

అదే ఏడాది ఏప్రిల్ 8న ఏయన్నార్-నాగ్ కలిసి నటించిన 'కలెక్టర్ గారి అబ్బాయి' ఘన విజయం అందుకోగా, ఏప్రిల్ 13న వచ్చిన బాలయ్య చిత్రం 'సాహస సమ్రాట్' ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ అదే ఏడాది నవంబర్ 12న నాగ్ 'కిరాయి దాదా'తో, నవంబర్ 19న బాలయ్య 'భానుమతి గారి మొగుడు' రీమేక్ చిత్రాలతో వచ్చి ఇద్దరూ విజయాలు అందుకున్నారు. 1988 మే నెలలో విడుదలైన నాగార్జున 'చినబాబు', బాలకృష్ణ 'తిరగబడ్డ తెలుగుబిడ్డ' చిత్రాలు రెండూ నిరాశపరిచాయి.

అయితే, 1989 అక్టోబర్‌లో వచ్చిన పోటీ సినీ పరిశ్రమను విశేషంగా ప్రభావితం చేసింది. అక్టోబర్ 5న విడుదలైన నాగార్జున 'శివ' ట్రెండ్ సెట్టర్‌గా నిలవగా, అక్టోబర్ 13న వచ్చిన బాలకృష్ణ 'బాలగోపాలుడు' ఓపెనింగ్స్ పరంగా అదరగొట్టింది. అనంతరం, 1991 ఫిబ్రవరిలో బాలయ్య 'తల్లిదండ్రులు' చిత్రం నాగార్జున 'నిర్ణయం'పై పైచేయి సాధించింది.

1994 ఏప్రిల్‌లో టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన పోటీ నమోదైంది. ఏప్రిల్ 14న బాలకృష్ణ జానపద చిత్రం 'భైరవద్వీపం', ఏప్రిల్ 20న నాగార్జున 'హలో బ్రదర్' విడుదలయ్యాయి. ప్రేక్షకులు రెండు చిత్రాలకూ బ్రహ్మరథం పట్టగా, లాంగ్ రన్‌లో 'భైరవద్వీపం' కొద్దిగా ఆధిక్యం ప్రదర్శించింది. ఆ తర్వాత, 1996 సంక్రాంతి బరిలో జనవరి 5న ఒకే రోజు పోటీపడిన చిత్రాలలో బాలయ్య 'వంశానికొక్కడు' విజయం సాధించగా, నాగార్జున 'వజ్రం' వెనుకబడింది.

2004 డిసెంబర్‌లో బాలయ్య నటించిన 'విజయేంద్రవర్మ' ఆశించిన విజయం సాధించలేకపోగా, నాగార్జున 'మాస్' బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక చివరిసారిగా 2016 సంక్రాంతి రేసులో బాలయ్య 'డిక్టేటర్'తో పోటీపడిన నాగార్జున, 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంతో విజయం సాధించి అప్పర్ హ్యాండ్ చూపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+