చంద్రబాబు భవిష్యత్తు సోనియాపైనే

చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఆసరాగా చేసుకుని తెలంగాణ, సీమాంధ్ర నాయకులు తమ ఇష్టప్రకారం వ్యవహరిస్తున్నారు. ఒకే పార్టీలో రెండు భిన్న వైఖరులు మాత్రమే కాకుండా రెండు భిన్న కార్యాచరణలు కూడా కొనసాగుతున్నాయి. తెలంగాణ నినాదంతో ఈ ప్రాంత శాసనసభ్యులు శాసనసభను స్తంభింపజేస్తే, ఆ తర్వాత సీమాంధ్ర శాసనసభ్యులు సమైక్యాంధ్ర నినాదంతో స్తంభింపజేశారు. ఇది ఎలా చూసినా పార్టీకి నష్టం కలిగించే విషయమే. ఆ తర్వాత సీమాంధ్ర శాసనసభ్యులను ఆయన దారికి తెచ్చినట్లు కనిపిస్తున్నారు గానీ అది ఒక్కసారిగా పేలే బుడగలాంటిది. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర నాయకులు ఏ దారి చూసుకుంటారో చెప్పడం కూడా సాధ్యం కాదు.
కాగా, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం స్వతంత్ర నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. నాగం జనార్దన్ రెడ్డి చంద్రబాబును ఖాతరు కూడా చేయడం లేదు. నాగం జనార్దన్ రెడ్డిని దెబ్బ తీయాలని చంద్రబాబు చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. తెలంగాణపై కాంగ్రెసు అధ్యక్షురాలు నిర్ణయం తీసుకోవడంలో ఎంత జాప్యం చేస్తే అంతగా తెలుగుదేశం పార్టీ బలహీనపడుతూ పోతుంది. ఇప్పటికీ నాయకులపై పట్టు కోల్పోయిన చంద్రబాబు మరింతగా పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. రెండు ప్రాంతాల్లోనూ ఆయన తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.