ప్రకాశం జనసేన కమిటీ రద్దు, బాలినేని ఎపిసోడ్- పవన్ నిర్ణయం వెనుక..!!
డిప్యూటీ సీఎం పవన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. క్రమశిక్షణ తప్పిన వారిని.. తన నిర్ణయాలతో విభేదించిన వారి పైన కఠిన చర్యలకు సిద్దమయ్యారు. అందులో భాగంగా ప్రకాశం ఉమ్మడి జిల్లా జనసేన కమిటీని రద్దు చేసారు. వైసీపీ మాజీ నేత బాలినేని పార్టీలో చేరిక.. తరువాతి పరిణామాల పైన పవన్ ఆగ్రహంతో ఉన్నారు. అయితే, ఈ కమిటీ రద్దు నిర్ణయం వెనుక అసలు కారణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ తాజాగా రాజమండ్రిలో కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీలో తాను తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించవద్దని స్పష్టం చేసారు. తన నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం జిల్లా జనసేనలో బహిర్గతమైన విభేదాలు, వివాదాలపై సీరియస్ అయ్యారు. మొత్తం పార్టీ ప్రక్షాళనకు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఒడా చైర్మన్ రియాజ్ అధ్యక్షుడిగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కమిటీని రద్దు చేశారు. అంతటితో ఆగకుండా జిల్లాలోని నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిలతో పాటు, ఇతరత్రా పార్టీ పదవులు ఉన్నవా రిని కూడా తప్పించేశారు. ఇటీవల పార్టీ నాయకులపై బహిరంగ విమర్శలు చేసిన జడా బాలనాగేంద్రను సస్పెండ్ చేశారు. తాత్కాలికంగా పార్టీ జిల్లా వ్యవహారాలను పరిశీలించి ముందుకు నడపాలని రాష్ట్ర నాయకులను ఆదేశించారు. సోమవారం రాజమండ్రిలో జిల్లా జనసేన నాయకులతో జరిగిన ప్రత్యేక భేటీ అనంతరం పవన్‌కల్యాణ్ ఈ నిర్ణయాలను ప్రకటించారు.

కాగా, జనసేనలో కొత్తగా చేరిన మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రియాజ్‌ల మధ్య విభేదాలు ఉన్న విషయం విదితమే. పార్టీలోకి బాలినేనిని తీసుకున్నప్పటి నుంచి ఆయనతో రియాజ్‌కు పొసగలేదు. ఇటీవల బాలినేనికి రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పార్టీ డీలిమిటేషన్ బాధ్యతలను పవన్ అప్పగించారు. ఆ సందర్భంగా ఒంగోలులో బాలినేని ఏర్పాటుచేసిన సమావేశానికి రియాజ్ గైర్హాజరయ్యారు. ఆ తర్వాత పదవుల సిఫార్సు విషయంలో బాలినేనితో విభేదించిన బాలనాగేంద్రయాదవ్ తాజాగా బాలినేనిపై తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకు ప్రతిగా జనసేనలోని ఇతర పలువురు ముఖ్యనాయకులు బాలినేనికి మద్దతుగా ప్రకటనలు చేశారు. ఈనేపథ్యంలో సోమవారం రాజమండ్రిలో డీలిమిటేషన్ రీజనల్ కమిటీ నాయకులతో పవన్ సమావేశమయ్యారు. అక్కడికే ప్రకాశం జిల్లాకు చెందిన ముఖ్యనాయకులను హడావుడిగా పిలిపించారు. నియోజకవర్గాల ఇన్‌చార్జిలలో కొందరితోపాటు, ఇటీవల జరిగిన సభ్యత్వ నమోదులో ఉత్సాహంగా పనిచేసిన వారిని కలిపి మొత్తం 14 మందిని రప్పించుకున్నారు. తొలుత రీజనల్ కమిటీ సమావేశంలో బాలినేని కూడా పాల్గొన్నారు. సాయంత్రం జిల్లాకు చెందిన జనసేన నేతలతో సమావేశమైన పవన్ జిల్లా పార్టీలో నెలకొన్న పరిణామాలపై తొలి నుంచి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
జిల్లా కమిటీలో, ఇతరత్రా మొత్తం 28 మంది నాయకులు ఉంటే 56 గొడవలు. వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించరు. మీరు పనిచేయరు, కొత్తవారు వస్తే అంగీకరించరంటూ సీరియస్ అయ్యారు. అక్కడ ఉన్న సీనియర్ నాయకుడైన మార్కాపురం ఇన్‌చార్జి కాశీనాథ్‌ను ఉద్దేశించి పార్టీలోకి ఎవరూ రావటానికి లేదా ఏంటి మీ ప్రవర్తన అని పవన్ ప్రశ్నించగా ఆయన మీ నిర్ణయానికి అనుగుణంగా బాలినేనిని మేము స్వాగతించామని అనగా మిగిలిన వారిలో కూడా పలువురు అదేమాట చెప్పారు. ఒంగోలు నుంచి వెళ్లిన ఇద్దరు నేతలు మాత్రం లేచి బాలినేని వ్యవహారశైలిపై ఫిర్యాదు చేశారు. వెంటనే జోక్యం చేసుకున్న పవన్ రియాజ్ ఏడి? ఎందుకు రాలేదంటూ ప్రశ్నించినట్లు తెలిసింది. అక్కడ మాట్లాడిన వారిని 'మీ హద్దుల్లో మీరు ఉండండి, పెద్దలను గౌరవించడం నేర్చుకోండి' అని మందలించినట్లు సమాచారం. అదేసమయంలో సమావేశంలోకి వెళ్లిన బాలినేని తాను 21మంది కార్పొరేటర్లను పార్టీలో చేర్చానని, ఎంతచెప్పినా వారిని కూడా కలుపుకొని వెళ్లడం లేదంటూ మరికొన్ని అంశాలను చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పవన్ ఓ.. అలాగా అంటూ బాలినేనిని బయటకు పంపి పార్టీలోని మిగిలిన నాయకులతో పార్టీ పరిస్థితి, నాయకుల వ్యవహారశైలిపై ఆగ్రహంతో మాట్లాడినట్లు తెలిసింది. అనంతరం ఆయన మొత్తం జిల్లా కమిటీతోపాటు నియోజకవర్గ ఇన్‌చార్జిలు, ఇతరత్రా జిల్లాలో పార్టీ పదవులు ఉన్న వారి పదవులన్నీ రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications