బాబు వైఖరే కొంప ముంచుతోందా?

ఇరు ప్రాంతాల నాయకులకు స్వేచ్ఛనిచ్చినట్లు చెబుతూనే చంద్రబాబు తెలంగాణ పార్టీ నాయకులను ఎప్పటికప్పుడు కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెసు కన్నా, తెరాస కన్నా దూకుడుగా వెళ్తే తప్ప తెలంగాణలో పార్టీ తిరిగి తన పాత వైభవాన్ని సంతరించుకోలేదనే విషయం స్పష్టంగానే అర్థమవుతోంది. చంద్రబాబుకు మాత్రమే ఈ విషయం అర్థం కావడం లేదు. క్షేత్రస్థాయిలో తెలంగాణ ప్రజలు తెలంగాణ తెలుగుదేశం నాయకులను నమ్మడం లేదు. వారెంతగా గొంతు చించుకున్నా, ఎంతగా తెలంగాణ గురించి మాట్లాడినా వారికి ఆ విశ్వసనీయత లభించడం లేదు. అందుకు చంద్రబాబు వైఖరి ప్రధాన కారణమని అందరికీ తెలుసు.
చంద్రబాబు తెలంగాణలో పార్టీని కాపాడాల్సిన బాధ్యతను ఈ ప్రాంత నాయకులపై పెట్టారు. కానీ వారికి తగినంత స్వేచ్ఛ లేదు. తెలంగాణ ప్రాంత నాయకులు కొంత మంది కాస్తా దూకుడుగా వ్యవహరించినట్లు కనిపించగానే వారిలోనే కలతలు చెలరేగుతున్నాయి. చంద్రబాబుకు అనుకూలురైన నాయకులు తెలంగాణ ఫోరం నాయకులపై ఫిర్యాదులు చేయడం, చంద్రబాబు నడుం బగించి వారి ముందరి కాళ్లకు బంధం వేయడం పరిపాటిగా మారింది. దీంతో తెలంగాణ ప్రాంత నాయకత్వం ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఉన్నంత కాలం తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పుంజుకోవడం సాధ్యం కాదు. పైగా, మరింతగా పార్టీ పరిస్థితి దిగజారే ప్రమాదం ఉంది. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం జాప్యం చేస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ నష్టపోతూనే ఉంటుంది.












Click it and Unblock the Notifications