తెలుగుదేశం పార్టీలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చిచ్చు పెట్టినట్లే కనిపిస్తున్నారు. ముఖ్యంగా, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ప్రస్తుతం రచ్చకెక్కడానికి చిరంజీవి నిర్ణయమే కారణమని అంటున్నారు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకోవడంతో కృష్ణా జిల్లా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మాజీ శాసనసభ్యుడు దేవినేని నెహ్రూకు ఇది కొరకరాని కొయ్యగా మారింది. కృష్ణా జిల్లాలోని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు కాంగ్రెసులోకి వస్తుండడం మాత్రమే కాకుండా తన చిరకాల ప్రత్యర్థి వంగవీటి రాధాకృష్ణ కూడా కాంగ్రెసు నాయకుడు అవుతుండడంతో దేవినేని నెహ్రూకు మింగుడు పడడం లేదు. తన ప్రాబల్యం తగ్గిపోయే వాతావరణం ఏర్పడింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి నిర్ణయం జరగక ముందు ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు వైయస్ జగన్‌తో వెళ్లే ఆలోచన కూడా ఆయన చేశారు. అయితే, ఆయనకు అది పెద్దగా ఉపయోగపడినట్లు కనిపించలేదని చెప్పవచ్చు.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర రావు దేవినేని నెహ్రూను తమ పార్టీలోకి తేవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీలోకి వస్తే తమ ప్రాబల్యం తగ్గడం ఖాయమని వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి నాయకులు భావిస్తున్నారు. అంతేకాకుండా, వంశీకి, నెహ్రూకు క్షణం పడదు. వారిద్దరు ప్రత్యర్థులుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో దేవినేని నెహ్రూ తెలుగుదేశం ప్రవేశాన్ని అడ్డుకోవడానికి వారు దేవినేని ఉమా మహేశ్వర రావుపై తీవ్ర విమర్శలు చేస్తూ వంశీ పార్టీ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
చాలా కాలంగా దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి వెంట కాంగ్రెసులోకి వచ్చే వంగవీటి రాధాకృష్ణను ఎదుర్కోవడానికి, వంశీని దెబ్బ తీయడానికి తెలుగుదేశం పార్టీని ఎంచుకోవడమే మంచిదనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి, వంగవీటి రాధాకృష్ణ ప్రజారాజ్యం పార్టీని వీడాలని అనుకున్నారు. చిరంజీవి మాట్లాడిన తర్వాత రాధాకృష్ణ తన ప్రయత్నాన్ని విరమించుకుని మౌనంగా ఉండిపోయారు. కాంగ్రెసులో చేరడానికి ఉన్న దేవినేని నెహ్రూ ఆటంకం రాధాకృష్ణకు తీరిపోయింది. ఇదే నెహ్రూకు సమస్యగా మారింది. ఈ పరిస్థితే తెలుగుదేశం కృష్ణా జిల్లా నాయకుల్లో విభేదాలకు, రాజీనామాలకు, పరస్పర సవాళ్లకు దారి తీసినట్లు భావిస్తున్నారు.
Political analysts say that the decision of Chiranjeevi to merge his Prajarajyam party in Congress is the main reason for the tussle in Krishna district TDP. As Devineni Umamaheswara rao is trying to induct Devineni Nehru in TDP, Vallabhaneni Vamsi is opposing.
Story first published: Friday, April 1, 2011, 14:29 [IST]