పాలన గవర్నర్ నరసింహన్‌దేనా?

మొత్తం పాలన గవర్నర్ కనుసన్నల్లోనే సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు గవర్నర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. గవర్నర్‌ను రీకాల్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో నరసింహన్ ప్రత్యక్ష జోక్యం చేసుకుంటున్నారనే విమర్శ వస్తోంది.
నిజానికి, మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం గవర్నర్ మీదనే ఆధారపడుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నారు. అంతేకాకుండా, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఎప్పటికప్పుడు సమావేశమవుతూ వ్యూహరచన చేస్తున్నారు. రాష్ట్ర పరిస్థితులపై ముఖ్యమంత్రిని తోసిరాజంటూ ఆయన ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆయన వ్యవహార శైలి ప్రశ్నార్థకంగా మారుతూ వస్తోంది.
కాంగ్రెసు పాలిత రాష్ట్రాల్లోనే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో కూడా గవర్నర్లను కాంగ్రెసు కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందనే విమర్శలున్నాయి. ఇప్పుడు కూడా నరసింహన్‌పై అదే తరహా విమర్శలు వస్తున్నాయి. కర్ణాటకలో గవర్నర్ భరద్వాజ్ కూడా బిజెపి ప్రభుత్వంపై రోజూవారీ పోరాటం చేస్తున్నారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
స్వర్గీయ ఎన్టీ రామారావును గద్దె దింపడానికి కూడా అప్పటి గవర్నర్ రామ్‌లాల్‌ను కేంద్రంలోని కాంగ్రెసు ప్రభుత్వం వాడుకుందనే దుమారం చెలరేగింది. రామ్‌లాల్‌పై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. నాదెండ్ల భాస్కర రావు చేత తిరుగుబాటు చేయించి ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూల్చడానికి కాంగ్రెసు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందనే వ్యాఖ్యలు వచ్చాయి. అలాగే, ఎన్టీ రామారావుపై ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తిరుగుబాటు చేసినప్పుడు అప్పటి కృష్ణకాంత్ పాత్ర కూడా వివాదాస్పదంగా మారింది. గవర్నర్ల వ్యవస్థపై ఎన్టీ రామరావు తీవ్రంగా విమర్శలు చేస్తూ వచ్చారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని, గవర్నర్ వ్యవస్థ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన వాదించేవారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం కూడా గవర్నర్ నరసింహన్ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతా నరసింహనే చక్కపెడుతూ వచ్చారు. ప్రభుత్వ వ్యవహారాల్లో విపరీతంగా జోక్యం చేసుకున్నారనే మాటలు వినిపించాయి. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బయటకు కనిపించే ప్రభుత్వ పెద్ద గానీ అంతా నరసింహన్ చేతుల మీదుగానే జరుగుతోందనే అభిప్రాయం ఉంది. అందుకే, తెలంగాణకు వ్యతిరేకంగా నరసింహన్ సూచనల మేరకే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనే అభిప్రాయం ఉంది.