జగన్ పార్టీకి సత్తా లేదా?

నిజానికి, ఆయన అత్యంత సన్నిహితులను కూడా ఆశ్చర్యపరిచినట్లు చెబుతున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సభలో ప్రకటించి, మర్నాడే పార్టీ జెండాను ఆవిష్కరింపజేశారు. పార్టీ అవతరణ సభ విడిగా మరోసారి ఉంటుందని చెప్పడానికి కూడా వీలు లేని పరిస్థితి. కాగా, పార్టీ జెండా ఆవిష్కరణ తేదీ ఖరారుకు ఆయన తన సన్నిహితులను కూడా సంప్రదించలేదని చెబుతున్నారు. పార్టీ అవతరణ సభ కోసం ఆయన పులివెందులలో భారీ సెట్టింగుతో వేదికను కూడా ఏర్పాటు చేశారు. సినిమా రంగానికి చెందిన తోట తరణితో వేదికను ఏర్పాటు చేయించారు. దాన్ని బట్టి జగన్ పార్టీ అవతరణ సభ భారీ యెత్తున ఉంటుందని అందరూ భావించారు.
అలాంటిదేమీ లేకుండా కుటుంబ కార్యక్రమంగానే జెండా ఆవిష్కరణ సభ జరిపించారు. ఇలా ఎందుకు చేశారనేది తెలియక ఆయన అనుచరులు కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. ఈ సభకు చాలా మంది ముఖం చాటేసినట్లు చెబుతున్నారు. జెండా ఆవిష్కరణ సభకు కేవలం 11 మంది శాసనసభ్యులు మాత్రమే హాజరయ్యారు. నాయకులు కూడా కొద్ది మందే ఉన్నారు. జగన్ వెంట 23 మంది శాసనసభ్యులున్నారనేది గత కొంత కాలంగా గట్టిగా ప్రచారం జరుగుతూ వచ్చింది. మిగతా 12 మంది శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదనేది ప్రశ్న. జగన్ అంచనాలను తలకిందులు చేస్తూ నాయకులు కూడా తక్కువ మందే వచ్చినట్లు చెబుతున్నారు. అభిమానుల సందడి కనిపించినప్పటికీ అది కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని అంటున్నారు.
వైయస్సార్ అకాల మరణానికి దిగ్భ్రాంతికి గురై మృత్యువాత పడిన కుటుంబాలను పరామర్శించడానికి తలపెట్టిన ఓదార్పు యాత్రను ఆయన తిరిగి చేపడతారా, మిగతా జిల్లాల్లో దాన్ని నిర్వహిస్తారా అనేది కూడా అనుమానంగానే ఉంది. ఓదార్పు యాత్ర పూర్తికాకుండానే ఆయన కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించడానికి సిద్ధపడ్డారు. వివిధ సమస్యలపై దీక్షలకు పూనుకుంటూ వచ్చారు.
శ్రీకాకుళం కాకర్లపల్లి ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టు బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జగన్‌కు చేదు అనుభవమే ఎదురైంది. దీన్ని బట్టి, వైయస్సార్ సంక్షేమ పథకాలు తనకు ఎంతగా ఉపకరిస్తాయో, ఆయన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అంతగా వ్యతిరేకంగా పనిచేస్తాయని మొదటిసారి జగన్‌కు తెలిసి వచ్చింది. అందువల్ల జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీది నల్లేరుపై బండి నడక ఏమీ కాదని అంటున్నారు.