వైయస్ జగన్‌పై ఒత్తిడి పెంచేందుకే...

జూలై 8వ తేదీన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీ సమావేశం జరుగుతోంది. ఇందులో పార్టీ విధివిధానాలను ఖరారు చేస్తారు. ఈ సందర్భంగా తెలంగాణపై కూడా వైయస్ జగన్ తన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేస్తే తెలంగాణపై జగన్‌కు తేల్చాల్సిన అవసరం ఉండదు. ఆయన సురక్షితంగా తెలంగాణ వివాదం నుంచి బయటపడతారు. తెలంగాణలో కూడా జగన్‌కు తగిన బలం ఉన్న నేపథ్యంలో కాంగ్రెసు, తెరాస పక్కా వ్యూహంతో పని చేస్తున్నాయని చెబుతున్నారు. జగన్‌ను తెలంగాణ వ్యతిరేకిగా నిలబెట్టేందుకు అవసరమైన సమయం కోసం ఆ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీతో ఆ సమయం వస్తుందని భావిస్తున్నారు. జగన్ ఎలాగూ తెలంగాణకు సానుకూలంగా నిర్ణయం తీసుకునే సాహసం చేయరని అంటున్నారు.
జగన్ శిబిరంలో ఇప్పటికే చాలా మంది సమైక్యాంధ్రవాదులున్నారు. పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ స్థితిలో జగన్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదని చెబుతున్నారు. జగన్ చేత జై తెలంగాణ అనిపిస్తామనే వరంగల్ జిల్లా శాసనసభ్యురాలు కొండా సురేఖ మాటలను ఎవరూ విశ్వసించడం లేదు. తెలంగాణలో పాగా వేయడానికి తగిన సందర్భం జగన్‌కు రాకూడదనే ప్రత్యర్థుల ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ ఉద్యమ కార్యాచరణ సాగుతున్నట్లు చెబుతున్నారు. వరంగల్‌లో ఈ నెల 13వ తేదీన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తలపెట్టిన ధర్నా సందర్భంగా తలెత్తిన సంఘటన వైయస్ జగన్ పట్ల తెలంగాణవాదులు భవిష్యత్తులో వ్యవహరించే తీరుకు అద్దం పడుతోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications