వైయస్ జగనే టార్గెట్

YS Jagan
రాష్ట్ర రాజకీయాల్లో రెండు ప్రధాన పార్టీలకు కూడా మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ టార్గెట్ అయ్యారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు వైయస్ జగన్‌పై ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తున్నాయి. వైయస్ జగన్ రాజకీయాలను కట్టడి చేయడానికి ముప్పు తిప్పలు పడుతున్నాయి. వైయస్ జగన్‌ను ముప్పు నుంచి బయటపడడానికి ఎప్పటికప్పుడు వ్యూహాలు రచించి అమలు చేస్తూ ఆయనను దెబ్బ తీయడానికి కాంగ్రెసు అధిష్టానం స్వయంగా రంగంలోకి దిగింది. వైయస్ జగన్‌తో తమకు కలిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని కాంగ్రెసు అధిష్టానం చేరదీస్తోంది. మరోవైపు, మంత్రులు వైయస్ వివేకానంద రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి, పి. శంకరరావుల ద్వారా జగన్ ఆయువుపట్లను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తోంది. వైయస్ వివేకానంద రెడ్డి కడప జిల్లాలో వైయస్సార్ కుటుంబానికి గల మద్దతును రెండుగా చీల్చేందుకు ప్రయత్నిస్తుంటే, ఆర్థికంగా, రాజకీయంగా జగన్‌ను దెబ్బ తీసేందుకు డిఎల్ రవీంద్రా రెడ్డి, పి. శంకరరావు ప్రయత్నిస్తున్నారు. దానికి తోడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా స్వయంగా జగన్‌పై దాడికి పూనుకుంటున్నారు.

కాంగ్రెసు అధిష్టానం వైయస్ జగన్‌పై ముప్పేట దాడికి పూనుకుంది. ఆర్థికంగా జగన్‌ను దెబ్బ తీయడానికి అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. జగన్ సంస్థలపై, జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినవారిపై ఆదాయం పన్ను శాఖ ద్వారా తగిన చర్యలు చేపట్టింది. జగన్ సంస్థలకు, సాక్షి మీడియాలో పెట్టుబడులు పెట్టిన సంస్థలకు ఐటి శాఖ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. త్వరలో సోదాలు కూడా నిర్వహించే అవకాశాలున్నాయి. జగన్ వెంటే వెళ్తున్న శాసనసభ్యులను నయానా భయానా తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇది కొంత మేరకు ఫలితం ఇచ్చినట్లే ఉంది. జగన్ వల్ల జరిగే నష్టాన్ని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ద్వారా భర్తీ చేసుకోవడానికి కాంగ్రెసు అధిష్టానం ప్రయత్నిస్తోంది. జగన్ చుట్టూ ఉచ్చు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్థిక వ్యవహారాలపై కాంగ్రెసు నాయకులు నిత్యం ఆరోపణలు చేయడం ఇందులో భాగమే.

కాగా, తెలుగుదేశం పార్టీ నాయకులు పరిటాల రవి హత్య కేసును వైయస్ జగన్‌పై దాడికి వాడుకుంటున్నారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ నిందితుడని, పరిటాల రవి హత్య కేసులో నిందితులను వరుసగా జగన్ హత్య చేయిస్తున్నారని ఆరోపిస్తోంది. ఏదో మేరకు జగన్‌పై అనుమానాలు బలపడే ప్రచారానికి తెలుగుదేశం పార్టీ ఒడిగట్టిందని భావించవచ్చు. తిరిగి సిబిఐతో పరిటాల రవి హత్య కేసుపై విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు సిబిఐ డిఐజికి, రాష్ట్ర గవర్నర్‌ను కోరారు. వైయస్సార్‌ హత్యా రాజకీయాలపై కూడా తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. దానికి తోడు, జగన్ ఆదాయ వనరులపై తీవ్రంగా దండెత్తుతోంది. జగన్ ఆస్తులపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రతి రోజు వ్యాఖ్యలు చేస్తున్నారు. పరిటాల రవి హత్య కేసులో జగన్‌పై చర్యలు తీసుకునేలా కాంగ్రెసు ప్రభుత్వంపై దాడికి దిగుతున్నారు. అయితే, కాంగ్రెసు మాత్రం జగన్ హత్యారాజకీయాల గురించి మాట్లాడడం లేదు.

చంద్రబాబు, తెలుగుదేశం ఆరోపణలకు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా తోడ్పడుతోంది. పరిటాల రవి హత్య కేసులో, సూరి హత్య కేసులో జగన్ పాత్ర ఉందని చెప్పడానికి ఆంధ్రజ్యోతి విరివిగా వార్తాకథనాలను ప్రచురిస్తోంది. జగన్ సాక్షి మీడియాలో పెట్టుబడులపై ఆరోపణలు చేస్తూ రామోజీ రావుకు చెందిన ఈనాడు దినపత్రిక ధ్వజమెత్తుతోంది. ఈ రెండు పత్రికల వార్తాకథనాలను తీసుకుని చంద్రబాబు కుమారుడు లోకేష్ సిఇవోగా ఉన్న స్టూడియోఎన్ తనదైన రీతిలో జగన్‌పై ధ్వజమెత్తుతూ వార్తాకథనాలను ప్రసారం చేస్తోంది. ఏమైనా, అధికార, ప్రతిపక్ష పార్టీలకు వైయస్ జగన్ టార్గెట్‌గా మారారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+