తెలంగాణపై తేల్చేయడానికే...

తమకు మంత్రి పదవులు ఇస్తే తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి పార్టీ అధిష్టానం సిద్ధంగా లేదనే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అందుకే తనకు మంత్రి పదవి ఇవ్వలేదని తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు అన్నారు. సీమాంధ్రకు చెందిన కావూరి సాంబశివరావుకు మంత్రి పదవి ఇస్తే కూడా అదే విధమైన సంకేతాలు వెళ్తాయని, పైగా తెలంగాణ పార్లమెంటు సభ్యులను విస్మరించి సమైక్యాంధ్ర కోసం మాట్లాడుతున్న కావూరికి మంత్రి పదవి ఇస్తే తెలంగాణ నుంచి మరింత వ్యతిరేకత ఎదరవుతుందని భావించినట్లు చెబుతున్నారు. విశాఖపట్నం జిల్లా అరకు లోకసభ సభ్యుడు కిశోర్ చంద్రదేవ్‌కు ఈ ప్రాంతీయ ఉద్యమాల మచ్చ ఏదీ అంటలేదు. ఆయన వాటికి దూరంగానే ఉంటున్నారు. అందువల్లనే ఆయనకు ప్రాతినిధ్యం కల్పించినట్లు తెలుస్తోంది.
సాయిప్రతాప్‌ను తొలగించడం వల్ల గానీ కిశోర్ చంద్రదేవ్‌ను తీసుకోవడం వల్ల గానీ ప్రాంతీయ అసమానతల గొడవ, రాజకీయాల ఒత్తిడి ఉండవని కాంగ్రెసు అధిష్టానానికి స్పష్టంగా తెలుసు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచన మేరకే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇతర పార్లమెంటు సభ్యుల జోలికి ప్రధాని మన్మోహన్ సింగ్ వెళ్లలేదని అంటున్నారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ తర్వాత తెలంగాణపై దృష్టి సారించే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉంది. దీనివల్ల ఇప్పుడే మంత్రి వర్గ విస్తరణలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యులను తాకకూడదని భావిస్తున్నట్లు సమాచారం. ఏమైనా, తెలంగాణ సమస్య వల్ల కేంద్ర మంత్రి వర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు సరైన ప్రాతినిధ్యం లభించలేదని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications