రాహుల్ ఆపరిక్వత, వివాదాల పుట్ట

ముంబైలో బుధవారం తీవ్రవాదులు దాడి చేయడంపై గురువారం రాహుల్ గాంధీ అందరికంటే విచిత్రంగా స్పందించారు. గతంలో చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆ వ్యాఖ్యలు కొందరు ఆమోదించిన సందర్భాలు ఉన్నాయి. కానీ గురువారం ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఎవరూ ఆమోదించేలా లేవు. ఉగ్రవాద దాడులు ఆపడం ఎవరి తరం కాదని, అమెరికా, ఆఫ్గనిస్తాన్, ఇరాక్‌లలో సైతం తరుచూ దాడులు జరుగుతున్నాయని, ముంబై సైతం ఆ కోవలోకే వస్తుందని చెబుతూ దాడులు అంత పెద్గ విషయమేమీ కాదన్నట్లు మాట్లాడాడు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ తీరు పోలీసుల మనోధైర్యం దెబ్బతీసేలా, ఉగ్రవాదులకు మరింత అవకాశం కలిగించేలా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని నిరోదించడానికి బిజెపి పోటా చట్టం తీసుకు వస్తే యుపిఏ దాన్ని పక్కన పెట్టింది. ఉగ్రవాదాన్ని మతానికి ముడిపెట్టి ఓటు బ్యాంకు రాజకీయం నెరపడంలో కాంగ్రెసు సైతం ఏమాత్రం తీసిపోవడం లేదు. రాహుల్ గాంధీ తీరు సైతం అలాగే కనిపిస్తోంది.
మతాన్ని ఉగ్రవాదానికి ముడిపెట్టడం కాంగ్రెసు, రాహుల్ గాంధీలకే సాధ్యంగా కనిపిస్తోంది. భవిష్యత్తు ప్రధానిగా కాంగ్రెసు పార్టీ పూజలు అందుకుంటున్న రాహుల్ గాంధీకి ఉన్న ఒకే ఒక అర్హత గాంధీ - నెహ్రూ కుటుంబం నుండి రావటం. దానిని మించి ఆయనకు ఏ అర్హత లేదు. ఇంకా చెప్పాలంటే ఆయన అనర్హుడు కూడా అని చాలామంది వాదిస్తున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ చాలా వృద్ధుడు అని చెప్పడానికి ఆయన వయసును కూడా గౌరవించకుండా అచ్యుతానందన్ అమూల్ బేబీ అని వ్యాఖ్యానించాడు. అందుకు అచ్యుతానందన్ ధీటుగానే స్పందించి ఇద్దరం అమూల్ బేబీలమే అని రాహుల్‌కు చురక అంటించారు. జాతీయ స్థాయిలో అభివృద్ధిలో, పెట్టుబడులు తీసుకు రావడంలో ముందున్న గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని విమర్శించాడు. అందుకు మోడీ స్పందిస్తూ రాహుల్ ఓ జెర్సీ బచ్చా అని అన్నాడు.
అంతేకాదు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను లష్కర్-ఇ-తోయిబాతో పోల్చాడం విచారకరం. ఆరెస్సెస్ హిందూవాద సంస్థ అనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. కానీ లష్కర్-ఇ-తోయిబాతో పోల్చడం మాత్రం ఖండించదగినదే. అప్పట్లో రాజకీయ అనుబంధ విద్యాసంస్థలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. గతంలో భారతదేశ భౌగోళక పరిస్థితులపై కూడా వ్యాఖ్యలు చేసి వివాదాస్పదుడయ్యాడు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిపైనా తీవ్ర విమర్శలు చేస్తూ కాంగ్రెసు పార్టీ దగ్గరకు బిఎస్పీ రాకుండా చేసిన ఘనత కూడా రాహుల్ గాంధీకే దక్కుతుందని పలువురి అభిప్రాయం.












Click it and Unblock the Notifications