వైయస్ జగన్‌కు టానిక్

వైయస్ జగన్ బలం క్రమంగా తగ్గిపోతూ వస్తుందనే అభిప్రాయం కూడా ఇటీవలి కాలంలో బలంగా వినిపిస్తోంది. ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆయనకు కలిసి వచ్చాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరోసారి జగన్ వైపు చూసే అవకాశం ఏర్పడింది. తెలుగుదేశం, ముఖ్యంగా కాంగ్రెసు స్థానిక నాయకులు కూడా వైయస్ జగన్ వైపు ఏదో మేరకు దృష్టి సారించడానికి ఈ ఎన్నికలు తోడ్పడతాయి. వైయస్ జగన్ వర్గం ఈ ఎన్నికలను ఆ దృష్టితోనే వాడుకుంటున్నట్లు కూడా అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే, కడపలో గెలుపు వైయస్ జగన్‌కు నైతికంగా బలాన్నిస్తుందని చెప్పవచ్చు. బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డితో పాటు మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, కన్నా లక్ష్మినారాయణ కడపలోనే మకాం వేసి వైయస్ జగన్ వర్గాన్ని ఓడించడానికి సర్వశక్తులూ ఒడ్డారు. తెలుగుదేశం పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులను తమ వైపు తిప్పుకున్నారు. అయినా వైయస్ జగన్ వర్గం అభ్యర్థిని ఓడించలేకపోయారు. ఇది రాబోయే పులివెందుల, కడప ఉప ఎన్నికల్లో వైయస్ జగన్‌కు ఉపయోగపడుతుందని చెప్పడానికి అనుమానించాల్సిన అవసరం లేదు. ఒక రకంగా నైతికంగా జగన్ బలాన్ని సమకూర్చుకున్నారని చెప్పవచ్చు.
ఇక, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొెత జిల్లా చిత్తూరులో జగన్ వర్గం పాగా వేసింది. ఒక్క ఓటుతోనే జగన్ వర్గం అభ్యర్థి తిప్పారెడ్డి గెలిచినా కిరణ్ కుమార్ రెడ్డిని దెబ్బ తీశామనే సంతృప్తి మిగులుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెసు పార్టీ గంగా భవానీని ఓడించడం కూడా జగన్ వర్గానికి లాభించేదే. రాబోయే రాజకీయ భవిష్యత్తుకు ఇది తొలిమెట్టుగా జగన్ భావిస్తూ ఉండవచ్చు.