వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ టార్గెట్ చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెసుకు చిరంజీవి ఆపద్బాంధువుడిలా మారడమే జగన్ ఆగ్రహానికి కారణమని అంటున్నారు. వైయస్ జగన్‌ను దెబ్బ కొట్టడానికి కాంగ్రెసు అధిష్టానం చిరంజీవిని ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. వైయస్ జగన్ ధిక్కార స్వరం వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వయంగా చిరంజీవితో మంతనాలు జరిపారు. చిరంజీవి నుంచి స్పష్టమైన హామీ లభించినప్పటి నుంచి వైయస్ జగన్‌పై కాంగ్రెసు అధిష్టానం తన వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తోంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఆశించిన స్థాయిలో నిలబెట్టలేకపోయినా, కాంగ్రెసులోకి వస్తే కలిసి వస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెసు క్యాడర్‌కు చిరంజీవి ఇమేజ్ తోడైతే ఫలితాలు ఆశాజనకంగా ఉండవచ్చు. దీంతో తనకు చిరంజీవి సీమాంధ్రలో సమస్యగా మారుతారనేది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. అందుకే చిరంజీవిని జగన్ వర్గం టార్గెట్ చేసుకుందని చెబుతున్నారు.

వైయస్ జగన్‌ను ప్రోత్సహించకుండా చిరంజీవితో స్నేహానికి పార్టీ అధిష్టానం ముందుకు వచ్చిందని, అదే జగన్‌ను తీవ్రంగా బాధపెట్టిందని జగన్ వర్గానికి చెందిన నాయకుడొకరు ఇటీవల అన్నారు. చిరంజీవితో చేతులు కలపడానికి సిద్ధపడడమే జగన్‌ను ఎక్కువ బాధ పెట్టిన అంశంగా ఆ నాయకుడు బహిరంగంగానే చెప్పారు. చిరంజీవి కాంగ్రెసులోకి వస్తేనే, కాంగ్రెసు మిత్రుడిగా ఉంటేనో రాష్ట్రంలో అధికారం తనకు అంది రాదనే భయం జగన్‌కు ఉన్నట్లు అర్థమవుతోంది. 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే చిరంజీవితో కాంగ్రెసు అధిష్ఠానం అంగీకారానికి వచ్చిందని భావిస్తున్నారు. అందువల్ల భవిష్యత్తులో కాంగ్రెసు అధిష్టానం తనకు అవకాశం కల్పించే అవకాశం లేదనే నిర్ధారణకు జగన్ వచ్చినట్లు చెప్పుకోవచ్చు. ఈ కారణంగా కాంగ్రెసుకు చిరంజీవిని దూరం చేయాలనే ఎత్తుగడలతో జగన్ వర్గం వ్యవహరిస్తోందని అంటున్నారు.

చిరంజీవి శుక్రవారం ఓ వర్గం మీడియాపై వ్యక్తం చేసిన అసంతృప్తి కూడా ఆ విషయాన్ని తెలియజేస్తోంది. తనను రాజకీయాలకు దూరం చేయాలని ఓ పత్రిక, ఓ చానెల్ ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. జగన్ సాక్షి మీడియాను ఉద్దేశించే చిరంజీవి ఆ మాటలన్నారని అర్థమవుతూనే ఉన్నది. చిరంజీవి ద్వారా కాంగ్రెసు నాయకత్వం ప్రజాకర్షణ లేని నాయకుడి లోటును భర్తీ చేసుకుంటోందని, దానివల్ల వచ్చే ఎన్నికల్లో ఏదో మేరకు తనకు నష్టం జరుగుతుందని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసును తీవ్రంగా దెబ్బ తీయడానికి చిరంజీవి ఇమేజ్ అడ్డం వస్తుందని ఆయన అనుకుంటున్నారని తెలుస్తోంది. దాంతోనే జగన్ సాక్షి మీడియా చిరంజీవిని టార్గెట్ చేసుకున్నట్లు భావించవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X