చెప్పని రాహుల్ గాంధీ: చిరంజీవి నిరీక్షణ

కేంద్ర మంత్రివర్గంలో చేరడానికి రాహుల్ గాంధీ ఇంకా ఎలాంటి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. నిజానికి మంత్రివర్గ విస్తరణ సెప్టెంబర్ మొదటివారంలోనే జరుగుతుందని భావించారు. రాహుల్ నిర్ణయం కోసమే ఇన్నాళ్లూ వేచి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్ఠానం రాహుల్ నిర్ణయంతో ప్రమేయం లేకుండా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలనే నిర్ణయానికి వచ్చింది.
శుక్రవారం జరిగే కోర్ కమిటీ సమావేశంలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై తుది మెరుగులు దిద్దుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వారం రోజుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చిరంజీవికి ఈసారి విస్తరణలో బెర్త్ ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చిరుతో పాటు రాష్ట్రం నుంచి మరో ఇద్దరికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేటు కోసం రాష్ట్రం నుంచి పలువురు పోటీ పడుతున్నారు.
సర్వే సత్యనారాయణ తనకు మంత్రి పదవి వస్తుందని గతంలో ఓసారి చెప్పారు. కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివ రావు వంటివాళ్లు కూడా చాలా కాలంగా మంత్రి పదవి కోసం వేచి చూస్తున్నారు. అయితే, వారికి అవకాశం వస్తుందా, లేదా అనేది చెప్పలేని స్థితే ఉంది. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో వివిధ కారణాలతో పలు ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని భర్తీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాగా, ఎస్ జైపాల్ రెడ్డిని, ఎస్ఎం కృష్ణలను మంత్రి పదవుల నుంచి తప్పించి రాష్ట్రాలకు పంపిస్తారని కూడా ఇటీవల ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి వీలుగా ఎస్ జైపాల్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పంపించవచ్చునని ప్రచారం సాగింది.












Click it and Unblock the Notifications