చంద్రబాబుతో జూ. ఎన్టీఆర్ కథ ముగిసినట్లే

విజయవాడ పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీ పట్ల చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి జూనియర్ ఎన్టీఆర్‌తో తెగదెంపులు చేసుకునే దిశగానే సాగుతున్నట్లు చెబుతున్నారు. వంశీ జూనియర్ ఎన్టీఆర్ సూచన మేరకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కలిశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్నే చంద్రబాబు కూడా నమ్ముతున్నట్లు చెబుతున్నారు. దానికితోడు, బాలకృష్ణ వంశీ పట్లనే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ పట్ల కూడా తీవ్ర విముఖతతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్‌తో మనకు అవసరం లేదంటూ రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ సమావేశంలో చంద్రబాబు పార్టీ నాయకులకు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో ప్రచారం కోసం అవసరమైతే బాలకృష్ణను వాడుకోవాలని, జూనియర్ ఎన్టీఆర్‌ను మాత్రం పిలువొద్దని ఆయన చెప్పినట్లు సమాచారం. పార్టీ ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా జూనియర్ ఎన్టీఆర్ తన వర్గం నాయకులను నడిపిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
వంశీకి షోకాజ్ నోటీసు జారీ అయిన తర్వాత నందమూరి అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా సెల్‌ఫోన్ మెసేజ్‌లు వెళ్లినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమాను చూడవద్దని ఆ మెసేజ్‌ల్లో సూచించారు. ఎన్టీ రామారావు నిజమైన వారసుడు సింహా బాలకృష్ణనే అని, జూనియర్ ఎన్టీఆర్ కారని, దమ్ము చూడవద్దని ఆ మెసేజ్‌ల సారాంశం. ఈ మెసేజ్‌లు తెలుగుదేశం పార్టీకి, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య సంబంధాలను మరింత దెబ్బ తీశాయి.
అంతేకాకుండా, బాలకృష్ణ అధినాయకుడు సినిమా పోస్టర్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఫొటో లేదు. మిగతా నందమూరి హీరోల ఫొటోలున్నాయి. దానికితోడు, జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లో ఉన్న ఓ టీవీ చానెల్‌లో చంద్రబాబుకు వ్యతిరేకంగా వార్తాకథనాలు ప్రసారం అవుతున్నాయని తెలుగునదేశం పార్టీ వర్గాలంటున్నాయి. ప్రస్తుత స్థితిలో తెలుగుదేశం పార్టీతో కొనసాగాలా,వద్దా అనేది జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకోవాల్సిందేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications