తెలంగాణ: రెండు కళ్ల సిద్ధాంతానికి బాబు స్వస్తి?

తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ ఇవ్వాల్సిన అవసరం ఉందని పార్టీ తెలంగాణ ప్రాంత నాయకుడు కడియం శ్రీహరి ఇటీవల అన్నారు. ఈ ఒత్తిడి పార్టీ తెలంగాణ నాయకుల నుంచి తీవ్రంగానే ఉంది. పరకాలలో ఓటమి తర్వాత ఆ ఒత్తిడి పెరిగింది. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెసు అధిష్టానం కూడా తెలంగాణపై కసరత్తును ముమ్మరం చేసినట్లు, రాష్ట్రపతి ఎన్నికలు పూర్తి కాగానే తన వైఖరిని ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి తెలంగాణపై చంద్రబాబు దృష్టి సారించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని, పార్టీపరంగా తీర్మానం చేయాలని, ఆ తీర్మానం ప్రతిని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని తెలుగుదేశం పార్టీలో ఓ నిర్ణయ జరుగబోతున్నట్లు చెబుతున్నారు. ఆ తీర్మానం ప్రతి కాపీలను తెలంగాణలోని గ్రామగ్రామాన పంచిపెట్టాలని, తద్వారా కోల్పోయిన విశ్వసనీయతను తెలంగాణ ప్రాంతంలో పొందాలని తెలుగుదేశం పార్టీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రోజుల్లో జరిగే పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై లేఖ రాసే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ వ్యతిరేకిగా పడిన ముద్రను తొలగించుకోవడానికి తెలంగాణపై తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెసు నాయకుల నోళ్లను మూయించడానికి కూడా ఇది పనికి వస్తుందని ఆయన అనుకుంటున్నారని సమాచారం. కేంద్రానికి రాసే లేఖ తిరిగి పార్టీలో వివాదం సృష్టించకుండా జాగ్రత్తగా రాయాలనే ఉద్దేశంతో పార్టీ నాయకులు ఉన్నారు. ఈ విషయంపై పార్టీ సీమాంధ్ర నాయకులతో చంద్రబాబు చర్చలు పూర్తయినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications