అవినీతి: జగన్‌కు ఎందుకు అంత మద్దతు?

ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు విజయాన్ని సానుభూతితో కొట్టేసేందుకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ప్రయత్నించాయి. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు వైయస్ జగన్ అవినీతిని ప్రధాన ఎజెండాగా తీసుకుని ఉప ఎన్నికల్లో ప్రచారం సాగించారు. జగన్ అవినీతి అసలు ప్రజల్లో ఎజెండాగా మారిందా అనేది ప్రశ్న. ఎన్డీటివీ సర్వే ఫలితాలను చూస్తే ఉన్నత స్థాయిలో అవినీతి ప్రజలకు ఇంకా పట్టే వాతావరణం భారతదేశంలో ఏర్పడలేదనేది తెలిసిపోతుంది. అలాగే అవినీతి విషయంలో ప్రజలు అన్ని పార్టీలను ఒకే గాటన కట్టేస్తున్నారనేది కూడా అర్థమైపోతుంది.
రాజకీయ నాయకులు అంతా అవినీతిపరులే అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. అలాంటప్పుడు వైయస్ జగన్ అవినీతిని రోసి ప్రజలు ఇటు తెలుగుదేశం వైపో, అటు కాంగ్రెసు వైపో రాలేదని గుర్తించాల్సిన అవసరం ఉంది. అంత మాత్రాన అవినీతిని సహించాలా అని ప్రశ్నించకుంటే లేదనే చెప్పాలి. ఇక్కడే మరో విషయాన్ని కూడా గుర్తించాలి. వైయస్ జగన్ అవినీతి కార్యకలాపాలు తక్షణమే ప్రజలపై ప్రభావం వేసే పరిస్థితి లేదు. దీర్ఘకాలంలో వాటి ప్రభావం ప్రజలపై సామూహిక ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పటికే చూపుతున్నాయి కూడా. వాటిని గ్రహించే స్థితి కూడా ప్రజలకు ఉండదు.
ఇక, ఉన్నత స్థాయిలో అవినీతి జరిగినప్పటికీ నిత్య జీవనంలో తక్షణ ప్రయోజనం కలగడాన్ని మాత్రమే ప్రజలు తమ అనుభవంలోకి తీసుకుంటారు. పాలకులు లేదా రాజకీయ నాయకులు ఎంతగా అవినీతికి పాల్పడినా తమకు ఏ మేరకు మేలు జరుగుతుందనేది చూస్తారు. అది కూడా వ్యక్తిగత ప్రయోజనమై ఉండాలి. అలా చూసినప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల లేదా ఇతర విధాల రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఏ ప్రయోజనం పొందిందనే మాట ప్రజల నుంచే వినిపిస్తుంది.
వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వాన్ని ప్రజలు కాంగ్రెసుకు కాకుండా వైయస్ జగన్‌కు కట్టబెట్టారనేది కూడా అర్థమవుతూనే ఉన్నది. అలా చూసినప్పుడు ప్రజల్లో వైయస్ జగన్‌కు పెద్ద యెత్తున ఆదరణ లభించడం ఆశ్చర్యకరమేమీ కాదు. పైగా, కాంగ్రెసులో ఉంటే జగన్‌పై సిబిఐ దర్యాప్తులవంటివి ఉండేవి కావనేది కూడా ప్రజలు నమ్ముతున్న విషయం. అంటే, కాంగ్రెసును సవాల్ చేయడం వల్లనే జగన్‌పై కేసులు పెట్టారని, లేకుంటే ఆయన అవినీతి కార్యకలాపాలపై చర్చనే ఉండేది కాదని ప్రజలు అనుకుంటున్నారు. ఈ విషయాలను కూడా ఇతర రాజకీయ పార్టీలు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది.
2జి స్పెక్ట్రమ్, కామన్‌వెల్త్ క్రీడల వంటి కుంభకోణాల్లో కాంగ్రెసు పార్టీ తమవారిని కూడా సహించలేదని, కళంకితులను కాంగ్రెసు సహించడానికి సిద్ధంగా లేదని ఎంతగా ప్రచారం చేసుకున్నా పప్పులు ఉడికే పరిస్థితి లేదు. ఆ కేసులు క్రమంగా నీరు కారుతాయనే అభిప్రాయమే ప్రజల్లో బలంగా ఉంది. అందువల్ల వైయస్ జగన్‌కు ప్రజల్లో ఆదరణ ఉండడంపై పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు.












Click it and Unblock the Notifications