కెసిఆర్‌కు నల్లేరు మీద బండి నడక కాదా?

స్థానికంగా రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత ఫలితాలపై పడుతుందని అంటున్నారు. కామారెడ్డి, స్టేషన్ ఘనపూర్ స్థానాల్లో తెరాస ఎక్కువగానే శ్రమించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహబూబ్‌నగర్ స్థానంలో బిజెపి కూడా రంగంలో ఉండడం తెరాసకు ఇబ్బందిని తెచ్చి పెట్టే అంశంగా మారింది. తెరాస అభ్యర్థికి మహబూబ్‌నగర్‌లో తెలంగాణ జెఎసి బహిరంగంగా మద్దతు ప్రకటించడం లేదు. బిజెపిని వ్యతిరేకించకలేక తెలంగాణ జెఎసి గోడ మీది పిల్లివాటాన్ని ప్రదర్శిస్తోంది. ఇది కూడా తెరాసను కాస్తా ఇబ్బంది పెట్టే విషయమే.
కాంగ్రెసు కన్నా తెలుగుదేశం తెలంగాణలోని ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈసారి తమ సత్తా చాటకపోతే పార్టీ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందనే ఉద్దేశంతో సర్వ శక్తులనూ ఒడ్డుతోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. కెసిఆర్‌పై తీవ్ర పదజాలంతో ఆయన దుమ్మెత్తిపోస్తున్నారు. కెసిఆర్‌ను టార్గెట్ చేసి, ఆయన నాయకత్వంపై ప్రజల్లో సందేహాలు రేకెత్తించే పద్ధతిలో చంద్రబాబు విమర్శలు, తెలుగుదేశం తెలంగాణ నేతల వ్యాఖ్యలు ఉంటున్నాయి. ప్రజల తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తూనే కెసిఆర్‌ను తాము వ్యతిరేకిస్తున్నామనే పద్ధతిలో వారు వ్యవహరిస్తున్నారు. ఇది ఎంత వరకు ఫలితాలు ఇస్తుందో చూడాల్సిందే.
కాంగ్రెసు పార్టీ బయటకు రెండు స్థానాల్లో గెలుస్తామని చెబుతున్నారు. కానీ పరిస్థితి అంత అనుకూలంగా ఉన్నట్లు లేదు. కొల్లాపూర్ నియోజకవర్గంలో మాత్రం మంత్రి డికె అరుణ వ్యక్తిగత ప్రతిష్ట కోసం చావో రేవో తేల్చుకోవాలనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. జిల్లాలో వ్యక్తిగత ప్రత్యర్థి అయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఓడించడమే ధ్యేయంగా ఆమె పావులు కదుపుతున్నారు. అయితే, ఆమె శ్రమ ఎంత వరకు ఫలిస్తుందనేది చూడాల్సిందే. ఏమైనా, కెసిఆర్‌కు ఈ ఉప ఎన్నికలు పరీక్షలాంటివే. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తెలంగాణ వైఖరికి కూడా ఈ ఉప ఎన్నికలు పరీక్ష పెడుతున్నాయి.