జెపి, సురవరం భేటీ: కొత్త సమీకరణాలు

వామపక్షాల మధ్య ఐక్యత అనే నినాదంతో సిపిఎంతో బేషరతుగా వెళ్లడానికి కూడా సిపిఐ సిద్ధపడడం లేదు. సురవరం సుధాకర్ రెడ్డి ఎబి బర్దన్ స్థానంలో పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ పరిణామాలు ఊపందుకుంటున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో పార్టీ స్వతంత్రంగా ఎదిగేలా కార్యాచరణను రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. వామపక్షాల ఐక్యత పేరుతో తన ఐడెంటీని తగ్గించుకోవడానికి కూడా సిపిఐ ఇష్టపడడం లేదు.
ఇటీవల సురవరం సుధాకర్ రెడ్డి హైదరాబాదు వచ్చినప్పుడు జయప్రకాష్ నారాయణ భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య మూడో ప్రత్యామ్నాయంపై చర్చలు జరిగాయి. రాష్ట్రంలో మూడు రాజకీయ పార్టీలు ఉన్నంత మాత్రాన ప్రత్యామ్నాయం కాదని, విధానపరమైన ప్రత్యామ్నాయం కావాలని సురవరం సుధాకర్ రెడ్డితో పాటు జయప్రకాష్ నారాయణ కూడా అభిప్రాయపడ్డారు. సిపిఐ, సిపిఎంలతో కలిసి పనిచేయాలని జయప్రకాష్ నారాయణ భావిస్తున్న సూచనలు అందుతున్నాయి.
తెలుగుదేశం పార్టీకి సిపిఐ, సిపిఎం దూరం కావడంతో వారితో కలిసి పనిచేయడానికి జయప్రకాష్ నారాయణ సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల పార్టీలు విస్తరించడం లేదనే అభిప్రాయం ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లోనూ ఉన్నట్లు అర్థమవుతోంది. సిపిఐ, సిపిఎం మధ్య అవగాహన ప్రస్తుతం ఒక సమస్యగానే ఉన్నట్లు తెలుస్తోంది. సిపిఎం పెద్దన్న పాత్ర వహిస్తుందనే అభిప్రాయం సిపిఐలో చాలా కాలంగా ఉంది. అలా కాకుండా సమాన స్థాయి అవగాహనకు మాత్రమే సిపిఐ సిద్ధపడాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
కాగా, తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సిపిఐ తెరాసతో పొత్తు పెట్టుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది. పరకాల విషయంలో సిపిఐ, తెరాసల మధ్య ఉన్న తేడాలు కూడా ముగిసే అవకాశం ఉంది. పరకాలలో సిపిఐ తెరాసకు మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. జయప్రకాష్ నారాయణ కూడా మునుపటిలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను కచ్చితంగా వ్యతిరేకించడం లేదు.
సిపిఐం తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. అయితే, సిపిఎంతో కలిసి పనిచేయడానికి సిపిఐ కొన్ని విషయాల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటి మధ్య ఉన్న ప్రధానమైన తేడాలేమిటో తెలియడం లేదు. కానీ, సిపిఎం ఏకపక్షంగా వామపక్షాల ఐక్యత పేరుతో వెళ్లే పరిస్థితి లేనట్లు కనిపిస్తోంది. దీంతో సిపిఐ మూడో ఫ్రంట్ ఏర్పాటుకు క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications