గాలి కేసులోనూ వైయస్ జగన్..?

ఆ దినపత్రిక వార్తాకథనం ప్రకారం - సీబీఐ అధికారులు గురువారం కొండారెడ్డిని మరోమారు పిలిపించారు. పాత విషయాలను మళ్లీ అడిగి కొన్ని విషయాలను నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో ఓబుళాపురం గనుల కేసులో జగన్‌ను నిందితుడిగా చేర్చే అవకాశం కనిపిస్తోంది. గాలి గనుల అక్రమా ల్లో జగన్ పాత్రను వివరిస్తూ అదనపు చార్జిషీటును దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో జగన్‌ను ఓఎంసీ కేసులో సీబీఐ ప్రశ్నించింది. ఈ కేసులో ఇంతకు ముందు సిబిఐ జగన్‌ను ప్రశ్నించింది. తానే సిబిఐని ప్రశ్నించినట్లు చెప్పి అప్పట్లో జగన్ సంచలనం సృష్టించారు.
ఇంకా ఆ పత్రికా ఇలా రాసింది - కొండారెడ్డి వాంగ్మూలంతో గనుల కేటాయింపులో జగన్ పాత్ర మొత్తం బయటపడింది. కొండారెడ్డిని జగన్ నేరుగా బెంగళూరుకు పిలిపించి బెదిరించడం, ఆ తర్వాత బలవంతంగా దరఖాస్తును ఉపసంహరింప చేయడం, నాటి సీఎం పేషీ ఉన్నతాధికారి భాను స్వయంగా కొండారెడ్డితో ఫోన్‌లో మాట్లాడటం, జగన్ సన్నిహితులు కూడా పలుమార్లు ఆయనకు ఫోన్లు చేయడం వంటి అంశాలను ససాక్ష్యంగా రుజువు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
కొండారెడ్డికి ఏయే తేదీల్లో బెదిరింపులు వచ్చా యి? ఏయే నంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి? ఆయన ఎప్పుడెప్పు డు బెంగళూరు, హైదరాబాద్ వెళ్లారు? వంటి విషయాలపై క్షేత్ర స్థాయిలో సిబిఐ అధికారులు సమాచారం సేకరించారని ఆ పత్రిక రాసింది. సీబీఐకి వాం గ్మూలం ఇచ్చిన తర్వాత కొండారెడ్డిని ఎవరైనా బెదిరించారా? రాజీ చేసుకోవాలని ఎవరైనా సూచించారా? అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ స్వయం గా కొండారెడ్డితో మాట్లాడి తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లతో అతనిచ్చిన సమాచారాన్ని సరిపోల్చుకున్నట్లు తెలిసింది.
ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రకారం - నిబంధనల ప్రకారం 'మొదట వచ్చిన వారికి మొదట' ప్రాతిపదికన గనులు కేటాయించాలి. ఓబుళాపురంలో గనుల లీజుకోసం తొలుత దరఖాస్తు చేసుకున్న వారిలో కొండారెడ్డి ఒకరు. రకరకాల కారణాలు చూపు తూ అధికారులు అందరి దరఖాస్తులను బుట్టదాఖలు చేశారు. కొండారెడ్డి మాత్రం దీనిపై న్యాయపోరాటం చేశారు. కోర్టులో ఆయనకు అనుకూల ఆదేశాలు వచ్చే అవకాశం కనిపించడంతో జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. బెంగళూరులోని తన ఇంటికి కొండారెడ్డిని పిలిపించుకుని, గాలి జనార్దన్‌రెడ్డి కోసం తప్పుకోమని సూచించారు.
అయితే, జగన్ హుంకరింపులకు ఏ మాత్రం భయపడని కొండారెడ్డి, రేసులో ఉంటానని స్పష్టం చేసి బయటకు వచ్చారు. జగన్ బృందం అనుమానించినట్లే ఓఎంసీకి గనుల కేటాయింపుపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో మరోసారి కొండారెడ్డిని జగన్ బెంగళూరుకు పిలిపించారు. కొండారెడ్డిని బెదిరించడమే కాకుండా తండ్రి వరదరాజులు రెడ్డికి మంత్రి పద వి ఇప్పిస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు ఆ పత్రిక రాసింది. గనుల్లో వాటా ఇచ్చేందుకు మాత్రం అంగీకరించలేదు.
చివరకు పెద్దవాళ్లతో గొడవ ఎందుకంటూ సన్నిహితులు, కుటుంబసభ్యులు సూచించడంతో కొండారెడ్డి కేసు ఉపసంహరించుకునేందుకు అంగీకరించారు. ఆ వెంటనే హైదరాబాద్‌లోని ఆర్ఆర్ గ్లోబల్ ఆఫీసుకు పిలిపించి కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు సిద్ధంచేసిన పత్రాలపై కొండారెడ్డితో సంతకాలు చేయించుకున్నారు. ఆ తర్వాత అంతా ఓఎంసీకి అనుకూలంగానే జరిగిందని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications