మద్రాసులో ఏమైంది: స్థానిక, స్థానికేతర గొడవ
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిన మరుక్షణం స్థానిక, స్థానికేతర వివాదం తెర మీదికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా సమస్య తలెత్తింది. అయితే, అది కొంత సజావుగానే సాగినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు రాజధాని, ఉద్యోగుల సమస్యులు మాత్రమే ఎదురయ్యాయి. తెలంగాణ, సీమాంధ్ర విడిపోయినప్పుడు స్థానిక, స్థానికేతర వివాదం కూడా చెలరేగే అవకాశాలున్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి.
మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు ఉద్యోగులు, హైకోర్టు, విశ్వవిద్యాలయాలు మొదలైన అంశాల్లో సమస్యలు ఎదురయ్యాయి. విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఆ ప్రాంత ఉద్యోగులే చూడాలని నిర్ణయించారు. అయితే తగినంత మంది ఆంధ్రా ఉద్యోగులు లేకపోవడంతో మిగిలిన రాష్ట్రాల్లో, కేంద్ర సర్వీసుల్లోనూ ఉన్న ఆంధ్రా ఉద్యోగులను బదిలీ మీద తీసుకురావాలని, అయినా అవసరముంటే ఆంధ్రేతర అధికారులను తాత్కాలికంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. ఈ విషయంపై ఆంధ్ర రాష్ట్ర బిల్లులో సవరణలు కూడా చేశారు.

మీడియా కథనాలను బట్టి - వాస్తవానికి ఒకే రాష్ట్రంలో జోనల్ వ్యవస్థలు, లోకల్, నాన్ లోకల్ విధానం ఉండవు. కానీ, తెలంగాణ ప్రాంతవాసుల విద్యా, ఉపాధి అవకాశాలను కాపాడడానికి 'స్థానికుల' ప్రయోజనాల రక్షణకు వీలుగా పలు మార్పులు చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రాన్ని ఆరు జోన్లగా విభజించారు. ఆయా ఉద్యోగాల స్థాయిని బట్టి స్థానికులకు 60 నుంచి 80 శాతం వరకు రిజర్వు చేశారు. ఇప్పటిదాకా ఇదే కోటా ప్రకారం నియామకాలు జరుగుతున్నాయి.
1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడిన వారికీ, ఇతరులకు మధ్య వివాదం తలెత్తింది. అప్పుడే ముల్కీ నిబంధనలను తెచ్చారు. దీని ప్రకారం ఒక ప్రాంతంలో ఏడేళ్లుగా స్థిర నివాసం ఉన్న వారిని స్థానికులుగా గుర్తిస్తారని చెప్పారు. వరుసగా నాలుగేళ్లు ఒకే ప్రాంతంలో చదివిన విద్యార్థులను 'లోకల్'గా గుర్తిస్తారు.
విభజన తర్వాత స్థానిక, స్థానికేతర వివాదం తలెత్తవచ్చునని భావిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ సమస్య ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ మా త్రం హైదరాబాద్‌లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ స్థానికులే అని ప్రకటించారు. ఇదే నిబంధన ఉపాధి, విద్యా అవకాశాలకు కూడా వర్తిస్తుందా అన్నది తేలాల్సి ఉందని ఆంధ్రజ్యోతి అనే ప్రముఖ దినపత్రిక వ్యాఖ్యానించింది.
ఉద్యోగుల విషయంలోనూ నియామక తేదీ ఆధారంగా ఒక కటాఫ్ నిర్ణయించి స్థానికులు, స్థానికేతరులుగా విభజిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం సచివాలయం, అసెంబ్లీ, రాష్ట్ర రాజధానిలోని పలు శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగాలు ఓపెన్ కేటగిరిలోనే ఉన్నాయి. ఇక్కడ ఏ ప్రాంతం వారినైనా నియమించుకునే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన జరిగితే ఇతర ప్రాంతాల వారు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లాల్సి ఉంటుందా? లేక ఇక్కడే కొనసాగవచ్చా? అనే అంశాలు ఉద్యోగులను వేధిస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కెసిఆర్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది.
ఈ అంశంపైనా కేంద్ర ప్రభుత్వమే మార్గదర్శకాలు రూ పొందించాల్సి ఉంటుందని ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. ఐఏఎస్‌లకు సంబంధించి కేడర్ విభజన జరుగుతోంది. మిగిలిన ఉద్యోగుల విషయంలో సర్వీసు రూల్స్ ప్రకారం విభజన ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications