నారా లోకేష్ జోరు: జూ. ఎన్టీఆర్‌కు బాబు టోకరా

జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కకు తప్పించి నారా లోకేష్‌ను వారసునిగా నిలిపేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను హరికృష్ణ బహిరంగంగానే వ్యతిరేకించారు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ సైతం కొంత కాలం వౌనంగా ఉండడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. బాలకృష్ణ మద్దతుతో నారా లోకేష్‌కు తన తరువాతి స్థానం కల్పించేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల పార్టీ నాయకులు లోకేష్ నాయకత్వాన్ని ఆమోదించే విధంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా లోకేష్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ పర్యటించారు.
ఇటీవల పరుసగా నారా లోకేష్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జిల్లాల్లో జరుగుతున్న మినీ మహానాడులో ఆయన ప్రసంగాలు చేస్తున్నారు. వరుసగా రెండు సార్లు ఓడిపోయి పార్టీ సంక్షోభ పరిస్థితిలో ఉంది, పార్టీ పరిస్థితి బ్రహ్మాండంగా ఉన్నప్పుడు పోటీదారులు, వారసులు ఎంతమందైనా వస్తారు, కానీ సంక్షోభ సమయంలోనే వారసున్ని తీర్చిదిద్దడం మంచిదని చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ ఉద్యమాలు సాగుతున్న సమయంలో మూడు ప్రాంతాల నుంచి ముగ్గురు కీలక నాయకులు పోటీ చేస్తే పార్టీకి ప్రయోజన కరంగా ఉంటుందని భావిస్తున్నారు.
చంద్రబాబు రాయలసీమ నుంచి, బాలకృష్ణ కోస్తా నుంచి పోటీ చేస్తారు. గుడివాడ నియోజక వర్గం నుంచి పోటీకి బాలకృష్ణ సన్నద్ధం అవుతున్నారు. నియోజక వర్గంలో ఇప్పటికే ఆయన పర్యటన జరిపారు. ఇక హైదరాబాద్ శివార్లలోని నియోజక వర్గం నుంచి జూనియర్ ఎన్టీఆర్ పోటీ చేస్తారని పార్టీ నాయకులు మీడియాకు చెబుతున్నారు. శేరిలింగంపల్లి నియోజక వర్గంలో ఇతర ప్రాంతాల ఓటర్లే ఎక్కువగా ఉన్నారని, ఇక్కడి నుంచి పోటీ చేస్తే తెలంగాణ నుంచి పోటీ చేసినట్టు ఉంటుంది, విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని పార్ట నాయకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications