డిఎస్ వెయిట్: కాంగ్రెసు నేతల గుండెల్లో గుబులు

అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ రాజశేఖర రెడ్డికి కూడా తెలియకుండా ఢిల్లీ వెళ్లి, పిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయనను పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించే వరకు వైయస్ రాజశేఖర రెడ్డికి తెలియలేదు. అప్పటి నుంచి డిఎస్ సత్తా ఏమిటో కాంగ్రెసు రాష్ట్ర నాయకులకు తెలిసి వచ్చింది. ఇప్పుడు ఆయన తరుచుగా ఢిల్లీ వెళ్తూ పార్టీ అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవడానికి ఏ మాత్రం ఆటంకాలు లేని నాయకుల్లో ఆయన ఒకరు.
సోనియా గాంధీతో పాటు ఇతర అధిష్టానం పెద్దలను ఆయన ఇటీవల తరుచుగా కలుస్తున్నారని సమాచారం. ఈ చర్చల ఫలితంగా రాష్ట్ర కాంగ్రెసు, ప్రభుత్వంలో ఏ విధమైన మార్పులు వస్తాయో తెలియక నాయకులు తలలు పట్టుకుంటున్నారు. శుక్రవారంనాడు ఆయన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నంబీ ఆజాద్‌ను కలిశారు. చలో అసెంబ్లీ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలను ఆయన ఆజాద్‌కు వివరించినట్లు తెలుస్తోంది.
మూడో సారి పిసిసి అధ్యక్ష పదవి కోసం ఆయన అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే, డిఎస్‌తో తెలంగాణ సమస్య పరిష్కారంపై అధిష్టానం పెద్దలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. డిఎస్ తన వ్యక్తిగత ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి వాస్తవాలకు రంగు పూయకుండా వివరిస్తారనేది అధిష్టానం విశ్వాసం. దీంతో తెలంగాణ పరిస్థితిపై, సమస్య పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెసు అధిష్టానం సుముఖంగా లేని ప్రస్తుత స్థితిలో తెలంగాణ నాయకులను సంతృప్తి పరచడానికి ఆయనను పిసిసి అధ్యక్షుడిగా నియమించినా ఆశ్చరపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. 2009లో కాంగ్రెసు విజయం సాధించినప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు.












Click it and Unblock the Notifications