టిడిపి బోనమెత్తిన బాబు: వైయస్ రికార్డు బ్రేక్
హైదరాబాద్: మొక్కని దేవుడు లేడు, పలకరించని మనిషి లేడు అన్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వస్తున్నా.. మీకోసం పాదయాత్ర సాగింది. పాదయాత్రలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి రికార్డును ఆయన బద్దలు కొట్టారు. వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రకు రెట్టింపు దూరం నడిచి రికార్డు సృష్టించారు. సరిగ్గా దశాబ్దం కిందట పాదయాత్ర చేసిన రాజశేఖర రెడ్డి 1356 కి.మీ. నడిచారు. అప్పట్లో ఆయన వయసు 53 ఏళ్లు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగించారు. 11 జిల్లాల్లోని 33 అసెంబ్లీ నియోజక వర్గాలను ఆయన సందర్శించారు. ఆయన పాదయాత్ర 55 రోజులపాటు సాగింది.
చంద్రబాబు 63 ఏళ్ల వయసులో పాదయాత్రను చేపట్టారు. తన 64వ పుట్టిన రోజును కూడా ఆయన పాదయాత్రలోనే జరుపుకొన్నారు. చంద్రబాబు పాదయాత్ర సుదీర్ఘంగా 208 రోజులపాటు సాగింది. అంతే సుదీర్ఘంగా ఆయన 2,817 కి.మీ. నడిచారు. అనంతపురం జిల్లా హిందూపురంలో మొదలు పెట్టి విశాఖ నగరంలోని శివాజీ నగర్‌లో ముగించారు. ఈ యాత్ర సందర్భంగా చంద్రబాబు 16 జిల్లాల్లోని 86 అసెంబ్లీ నియోజక వర్గాలు, 28 మునిసిపాలిటీలు, ఐదు కార్పొరేషన్లు, 162 మండలాలు, 1,253 గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు.
చంద్రబాబుకు మించిన పాదయాత్ర చేసిన వాళ్లు దేశంలో ఒక్కరే ఉన్నారు.మాజీ ప్రధాని చంద్రశేఖర్ రికార్డు స్థాయిలో పాదయాత్ర చేశారు. ఆయన కన్యాకుమారి నుంచి దేశ రాజధాని ఢిల్లీలోని మహాత్మ గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వరకు పాదయాత్ర చేశారు. ఆరున్నర నెలలపాటు 4,260 కిలోమీటర్లు నడిచారు. కానీ, ఆయన కూడా చంద్రబాబు మాదిరిగా ఇన్ని గ్రామాలు పర్యటించలేదని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.

చంద్రబాబు పాదయాత్రకు ఎక్కడికక్కడ తెలుగు మహిళలు ఇలా నీరాజనాలు పట్టారు. ప్రతి జిల్లాలో ఆయనకు స్వాగతం పలికారు.

గతంలో గంభీరంగా, మనుషులకు దూరంగా ఉండే చంద్రబాబు ప్రజల్లో కలిసిపోవడానికి ప్రయత్నించారు. ప్రతి వృత్తినైపుణ్యాన్ని, ప్రతిభను ఇలా వారితో కలిసిపోయి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

పేద పిల్లల భుజాల మీద చేయివేసి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేశారు. ఓట్లు లేని పిల్లలను కూడా ఆయన పలకరించారు.

ఇలా అందరితోనూ కలివిడిగా ఉంటూ వారి మాటలు వింటూ వారి సమస్యలు తెలుసుకుంటూ చంద్రబాబు పాదయాత్ర సాగించారు.

చంద్రబాబు తన పాదయాత్రలో ఆలయాలను దర్శించారు, దేవుళ్లకు మొక్కుకున్నారు.

చంద్రబాబు ప్రజల మధ్య ఉండడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేశారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బోనమెత్తి సుదీర్ఘ పాదయాత్ర చేశారు. పార్టీని నిలబెట్టి, తిరిగి అధికారంలోకి రావడానికి ఆయన ఈ సాహసకార్యానికి ఒడిగట్టారు.

చంద్రబాబు నాగలి పట్టి పొలం దున్నారు. రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఇస్త్రీ చేశారు. బుట్టలు అల్లే ప్రయత్నం చేశారు. డప్పు కొట్టారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పాదయాత్రలో ఆయనను శారీరక ఇబ్బందులు ఎదురయ్యాయి. పాదయాత్ర ప్రారంభించిన రెండవ రోజే ఆయన కాళ్ల కండరాలు పట్టేశాయి. దీనితో ఫిజియోథెరపీ చికిత్స చేయించుకుని పాదయాత్ర కొనసాగించారు. అనంతపురం, కర్నూల్ జిల్లాలో పాదయాత్ర ముగించుకుని, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ చేరుకున్న ఆయన సభావేదికపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వేదిక కూలిపోవడంతో బాబు నడుం, వెన్నుముకకు స్వల్ప గాయాలయ్యాయి. దీనితో వైద్యుల సూచనల మేరకు ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు.
నడుంనొప్పి, వెన్నుముక గాయంతోనే తిరిగి ఆయన పాదయాత్ర కొనసాగించారు. దీనితో నడుం, వెన్నుముక గాయాలు తీవ్రరూపం దాల్చాయి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర ముగించుకుని మెదక్ జిల్లాలో అడుగిడిన బాబుకు ఎడమ కాలి చిటికెనవేలుకు గాయమైంది. అయినా ఆయన లెక్కచేయకుండా అలాగే పాదయాత్ర కొనసాగించారు.
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర ముగించుకుని వరంగల్ జిల్లాకు చేరుకున్న బాబుకు చిటికెనవేలు గాయం తీవ్రరూపం దాల్చింది. ఒక వైపు చికిత్స పొందుతూనే, మరో వైపు పాదయాత్ర కొనసాగించారు. బాబు అవస్థను చూడలేని పార్టీ నేతలు, శ్రేణులు తాత్కలికంగా పాదయాత్రకు విరామాన్ని ప్రకటించాలని సూచించారు. అయితే ఆయన వినలేదు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో చిటికెన వేలుగాయంతోనే పాదయాత్ర పూర్తి చేశారు. కృష్ణా జిల్లాలో ప్రవేశించిన చంద్రబాబు ఎడమకాలి చిటికెన వేలు గాయం మరింత తీవ్రం కావడంతో వైద్యులు తప్పనసరి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, శ్రేణుల ఒత్తిడి మేరకు పరిటాల వద్ద నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న ఆయన తిరిగి పాదయాత్రను కొనసాగించారు.
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ పరిధిలో సభా వేదిక మెట్లు కూలి కిందపడిపోబోయిన చంద్రబాబును ఆయన అంగరక్షకులు సమయోచితంగా వ్యవహరించి కాపాడారు. దీనితో పెనుప్రమాదం తప్పిందని పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర ముగించుకుని విశాఖ జిల్లాలో అడుగిడుతున్న సమయంలో కాళ్ల నొప్పులు తీవ్రం కావడంతో మరో రెండు రోజుల పాటు చంద్రబాబుకు విశ్రాంతి తీసుకున్నారు. ఆరోగ్యాన్ని, గాయాలను ఎంతమాత్రం లెక్క చేయకుండా సుదీర్ఘ పాదయాత్రను సాగించారు.












Click it and Unblock the Notifications