గందరగోళం: వైయస్ జగన్‌లో పరిపక్వత లేదా?

ఇటీవలి కాలంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అన్ని జిల్లాల్లోనూ అసమ్మతులు, అసంతృప్తులు పెరుగుతున్నాయి. తొలుత ప్రాధాన్యం పొందిన నేతలు వెనక్కి వెళ్లే పరిస్థితి వచ్చింది. ముందుగా వచ్చిన తాము ముందు వరుసలో ఉంటామనే నాయకులకు ఆశాభంగం కలుగుతోంది. మాజీ మంత్రి కొండా సురేఖ, కొణతాల రామకృష్ణ విషయాల్లోనే కాకుండా పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి విషయంలో వైయస్ జగన్ అనుసరిస్తున్న వైఖరి ఆయన రాజకీయ అపరిపక్వతను తెలియజేస్తోందని అంటున్నారు.
తెలంగాణవాదానికి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి సవాల్ విసురుతూ తెలంగాణలో గోడలా నిలబడిన కొండా సురేఖకు ప్రాధాన్యం తగ్గించడంపై చాలా మంది పెదవి విరుస్తున్నారు. కాంగ్రెసు పార్టీలో తనకు ఉన్న ప్రాధాన్యాన్ని తోసిరాజని ఆమె జగన్ వెంట నడిచారు. కొండా దంపతులకు వరంగల్ జిల్లాలో తగిన బలం కూడా ఉంది. జిల్లాలోని కొమ్ములు తిరిగిన నాయకులను ఎదుర్కుని వారు నిలబడ్డారు. జిల్లాలో ప్రాధాన్యం తగ్గించడం వల్ల కొండా దంపతులు ఈ రోజు పార్టీని వీడే పరిస్థితి ఎదురైంది.
విశాఖపట్నం జిల్లాలో కొణతాల రామకృష్ణ పట్ల జగన్ వ్యవహరించిన తీరు కూడా విమర్శలకు గురవుతోంది. మొదటి నుంచి పార్టీలో ఉండి, వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తూ, పార్టీ ముఖ్య నాయకుల్లో ఒక్కడిగా ఉంటూ వస్తున్న కొణతాల రామకృష్ణ మాటను పెడ చెవిన పెట్టి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన దాడి వీరభద్రరావును చేర్చుకోవాలనే నిర్ణయం కూడా జగన్ అపరిపక్వత వ్యక్తమవుతోందని అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి నెల్లూరు జిల్లాలో మేకపాటి సోదరులు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అటువంటి నాయకుడి మాటలను కూడా జగన్ బేఖాతరు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలా పలు జిల్లాల్లో మొదటి నుంచీ పార్టీకి, తన కుటుంబానికి మద్దతు ఇస్తూ వస్తున్నవారిని పక్కకు నెట్టేసి తాజాగా వస్తున్న నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మొదటికే మోసం వస్తుందని అంటున్నారు.
జగన్ ధీమా అదేనా..
జిల్లాల్లో నాయకుల వల్ల కాకుండా తమ కుటుంబం పట్ల ఉన్న సానుభూతి, తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి పట్ల ఉన్న ఆదరణ మాత్రమే తన పార్టీకి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి పెడుతుందనే ఆలోచనతో వైయస్ జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే, ఆయన ఎంతటి ముఖ్యమైన నాయకులనైనా సరే దూరం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారని అంటున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తన పార్టీ అభ్యర్థులను కూడా గెలిపిస్తాయని, ఆయన నాయకుల బలాలు కాదని ఆయన నమ్ముతున్నట్లు చెబుతున్నారు. అభ్యర్థులు ఎవరనేది కాదనేది వచ్చే ఎన్నికల్లో తన పార్టీకి ముఖ్యం కాదనే ధోరణితో ఆయన వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది. మొత్తం మీద, ఇతర పార్టీల బలాల వల్ల కాకుండా తన సొంత వ్యవహారశైలి వల్ల భవిష్యత్తులో వైయస్ జగన్ దెబ్బ తినే ప్రమాదం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications