జంపింగ్ జపాంగ్: బొత్స లిస్ట్‌లో 26 మంది, కానీ
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీలో జంపింగ్ అంశం చర్చనీయాంశమైంది. విభజన నిర్ణయం నేపథ్యంలో కొద్ది నెలలుగా పలువురు సీమాంధ్ర నేతలు వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల వైపు చూస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన దాదాపు 25 నుండి 30 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడవచ్చునని చెప్పారు.
అప్పటి నుండి జంపింగ్ అంశం కాంగ్రెసులోనే కాకుండా జగన్ పార్టీ, టిడిపిల్లోను చర్చనీయాంశమైంది. టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం మాట్లాడుతూ.. కాంగ్రెసు పార్టీలోను కొంతమంది మంచి వాళ్లున్నారని, అలాంటి వారు వస్తే తాము ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎవరెవరు కాంగ్రెసు పార్టీని వీడుతారనే చర్చ బాహాటంగానే సాగుతోంది. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అసంతృప్తితో ఉన్న సీమాంధ్ర కాంగ్రెసు నాయకులకు గాలం వేస్తున్నారట. బొత్స కూడా పార్టీ మారే వారి చిట్టా తమ వద్ద ఉందని చెప్పారు.

పార్టీకి ఎవరెవరు గుడ్‌బై చెబుతారు? ఏయే జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు? అనే అంశాలపై బొత్స సత్యనారాయణ ఓ జాబితాను రూపొందించారట. కర్నూలు, విశాఖపట్నం జిల్లాల నుంచి నలుగురేసి, అనంతపురం, విజయనగరం, చిత్తూరు, గుంటూరు ప్రకాశం, కడప, నెల్లూరు నుంచి ఒక్కొక్కరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం నుంచి ఇద్దరేసి చొప్పున పార్టీని వీడనున్నారని పిసిసి జాబితా సిద్ధం చేసిందని తెలుస్తోంది. మొత్తంగా 26 మంది గోడదూకనున్నట్లు పిసిసి గుర్తించినట్లుగా సమాచారం.
అయితే, ప్రచారం మాత్రం అంతకంటే ఎక్కువ మంది వీడుతారని జరుగుతోంది. పార్టీని వీడేందుకు వీలుగా జిల్లాలోని పది నియోజకవర్గాల కాంగ్రెస్ ముఖ్య నేతలతో శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాద రావు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ధర్మానతో పాటు టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి తదితరులు కూడా పార్టీని వీడతారన్న ప్రచారం బలంగా ఉంది. కడప జిల్లాలో ఓ ఎమ్మెల్యే టిడిపితో చర్చల్లో ఉన్నారట. శ్రీకాకుళం జిల్లాలో అధ్యక్షుడి పైనే వేటు పడనుందంటున్నారు.
విజయనగరానికి సంబంధించి మంత్రి శత్రుచర్ల విజయ రామరాజు జగన్ వైపు వెళ్లనున్నట్లు ప్రచారం సాగుతోంది. మరో ఎమ్మెల్యే జనార్దన్ చాట్రాజ్ కూడా అదే దారిలో ఉన్నారట. పార్వతీపురం ఎమ్మెల్యే జయమణి కూడా ఊగిసలాటలో ఉన్నారంటున్నారు. విశాఖపట్నానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాస రావు టిడిపి వైపు మొగ్గు చూపుతున్నారని, ఆయనతో పాటు నలుగురు వస్తారని కొద్దిరోజులుగా బలమైన వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. జనవరి 17ను పార్టీని వీడేందుకు ముహూర్తంగా ఖరారు చేసుకునన్నారట.
తూర్పు గోదావరి జిల్లాలో తోట త్రిమూర్తులుతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే ఆయన వెంట నడవాలని, లేకుంటే పాత గూటికే వెళ్లిపోవాలని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఆయన దారిలోనే జిల్లాకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా నడవనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇదే జిల్లాకు చెందిన మంత్రి పితాని సత్యనారాయణ కూడా కిరణ్ కొత్త పార్టీ స్థాపిస్తే ఆయన వెంట నడవాలని, లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో రాష్ట్ర విభజన నిర్ణయం ప్రభావం కాంగ్రెస్‌పై బాగా పడనుందని అంటున్నారు. ఒక మంత్రి టిడిపిలో చేరతారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. కృష్ణా జిల్లాలో ఎంపి లగడపాటి రాజగోపాల్ బాహాటంగానే అధిష్ఠానంపై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. మల్లాది విష్ణు కిరణ్ బాటలో నడిచే అవకాశముంది.
ప్రజారాజ్యం పార్టీ నుంచి విజయం సాధించి తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మారిన వారు గంటా బాటలో నడవాలనే యోచనలో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో పార్టీ సీనియర్ ఎమ్మెల్యేనే ఒకరు ఇమడలేని పరిస్థితి ఉందంటున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పూర్వ పిఆర్పీ నేతలు టిడిపి బాట పట్టే అవకాశాలున్నాయట. జనవరి 23 తర్వాత అందరితో భేటీ అయి సమష్టి నిర్ణయం తీసుకుందామన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో కొందరిలో మార్పు వచ్చిందంటున్నారు. మాజీ మంత్రి ఒకరు టిడిపిలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట.
చిత్తూరు జిల్లాలో చాలా మార్పులే ఉండనున్నాయి. మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్‌కు టిడిపి తరఫున లోక్‌సభ స్థానం ఖరారు కానుండటంతో ఆమె కాంగ్రెస్‌లో కొనసాగుతారా? లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన కొడుకు ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానని అరుణ కుమారి రెండురోజుల క్రితం చెప్పారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా టిడిపి వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.
అనంతపురం జిల్లాకు సంబంధించి జెసి దివాకర్ రెడ్డి కాంగ్రెస్‌ని వీడినా వీడకపోయినా ఆయన కుమారుడు పవన్, సోదరుడు ప్రభాకర్ రెడ్డి టిడిపిలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన మరో కీలక నేత కూడా పార్టీ మారే ఆలోచనలో పడ్డారని అంటున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు టిడి వెంకటేశ్, ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో ఉండబోరన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే వారు టిడిపితో అవగాహన కుదుర్చుకున్నారని చెబుతున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానం దిద్దుబాట చర్య ప్రారంభించింది.












Click it and Unblock the Notifications