బిజెపి, టిడిపి ఇక తెగదెంపులేనా: ఎవరు ముందు?
హైదరాబాద్: బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య తెగదెంపులకు మానసికరంగా రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రగిలిపోతుండగా, ప్రత్యేకహోదాపై నెపాన్ని ఆయన తమ మీదికి నెడుతున్నాడనే అసంతృప్తి బిజెపి నేతల్లో ఉంది.
అంతేకాకుండా, తెలుగుదేశం పార్టీతో పొత్తు ఇలాగే కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్‌లో సొంతంగా ఎదగలేమనే అభిప్రాయంతో బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నాయకులు కూడా ఇదే విషయాన్ని ఆయనకు చెప్పినట్లు సమాచారం. మాజీ కేంద్ర మంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావు వంటి హేమాహేమీలు పార్టీలో చేరినప్పటికీ పెద్ద ఫలితం రాకపోవడానికి తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగించడమేననే అభిప్రాయంతో బిజెపి నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, పొత్తు తెగిపోవడానికి ఎవరు ముందడుగు వేయాలనే విషయంపైనే ఇరు పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తప్పు ఎదురు పార్టీ మీద నెట్టేయడానికి అవసరమైన సందర్భం కోసం ఇరు పార్టీలు ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు.

ఇరు పార్టీల నాయకులు లోలోన అసంతృప్తితో రగిలిపోతున్నప్పటికీ క్యాడర్ మాత్రం బయటపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ మంత్రి, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు సొంత నియోజకవర్గం తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, బీజేపీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. రెండు పార్టీల మధ్య గొడవ రాజుకుంది. ఇందుకు పశ్చిమ గోదావరి మున్సిపల్ సమావేశం వేదికైంది.
టిడిపి, బిజెపి కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగారు. తాడేపల్లిగూడెంలో నిట్ శంకుస్థాపన విషయంలో ఇరు పార్టీలకు ఏకాభిప్రాయం కుదరట్లేదని, ఇక ఉండలేమని బీజేపీతో టీడీపీ తేల్చి చెప్పేసినట్లు సమాచారం. మున్సిపల్ సమావేశంలో టిడిపి, బిజెపికి చెందిన రెండు పార్టీలకు చెందిన కౌన్సిలర్లు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. మొత్తం మీద, వచ్చే ఎన్నికల ముందు వరకు దోబూచులాట కొనసాగవచ్చునని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications