బాబుకు కౌంటర్: సీమాంధ్ర సిఎం అభ్యర్థి వెంకయ్య?
న్యూఢిల్లీ: సీమాంధ్ర ఎన్నికల బరిలోకి దిగాలని పార్టీ సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడిపై బిజెపి శ్రేణులు ఒత్తిడి పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పొత్తు విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై ఆగ్రహంగా ఉన్న బిజెపి నాయకులు ఒంటరిగా బరిలోకి దిగి తమ సత్తా చాటాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇందుకుగాను, సీమాంధ్రలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగాలని వెంకయ్యపై ఒత్తిడి పెరుగుతున్నట్లు చెబుతున్నారు.
సీమాంధ్రకు న్యాయం చేయడానికి రాజ్యసభలో వెంకయ్య చేసిన ప్రయత్నంతో ప్రజల్లో సానుకూలత పెరిగిందని అంటున్నారు. తాము కోరినన్ని సీట్లు ఇస్తేనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని, లేదంటే ఒంటరిగా వెళ్లాలని బిజెపి పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో సీమాంధ్రలో వెంకయ్య నేతృత్వంలో పెద్దఎత్తున ప్రచారం ప్రారంభించాలని ఒత్తిడి పెరుగుతోంది.

ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలోనూ, ఏలూరులో పార్టీ సమావేశంలో ఈమేరకు డిమాండ్లు వచ్చాయని, వీటిని వెంకయ్య నాయుడు తిరస్కరించారని వార్తలు వచ్చాయి. అయితే తెలగుదేశంతో పొత్తు లేకపోయినా సీమాంధ్రలో గట్టి పోటీ ఇచ్చే శక్తి బిజెపికి ఉందని వెంకయ్యనాయుడు వారికి విశ్వాసం కలిగించారని, ఈ దిశగానే పార్టీ ముందడుగు వేస్తున్నదని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్, నాగార్జున వంటి సినీ ప్రముఖులతో పాటు వెంకయ్య నాయుడు సీమాంధ్రలో ప్రచారంలోకి దిగితే తెలుగుదేశం పార్టీని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఎదుర్కోవడం సులభమని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని వదిలేసి బిజెపితో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. పొత్తుల విషయంలో తమంత తాముగా తెలుగుదేశం పార్టీకి దూరం జరుగుతున్నట్లు ఉండకూడదని, టిడిపి వైఖరి పూర్తిగా బయటపడేవరకు వేచి చూడాలని బిజెపి నాయకులు భావిస్తున్నారు.
తాము అడిగిన సీట్లు ఇవ్వాల్సిందేనని, లేదంటే పొత్తు కుదరదని బిజెపి నాయకులు టిడిపిపై ఇప్పటికే ఒత్తిడి పెడుతున్నారు. పొత్తు విషయంలో బంతి టిడిపి కోర్టులో ఉందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడంలోని ఆంతర్యం ఇదేనని అంటున్నారు. పొత్తుకు సరైన ప్రాతిపదిక ఉండాలని వెంకయ్య నాయుడు అనడంలో కూడా చంద్రబాబుపై ఒత్తిడి పెంచే వ్యూహం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications