వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1991లో ఏం జరిగింది: పీవీ ప్రధాని ఎలా అయ్యారు?

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలుగు జాతి గౌరవాన్ని దేశ చరిత్రలో పీవీ ఇమడింపజేశారు. ఆయన జీవిత విశేషాలతో ఇప్పటికే ఎన్నో పుస్తకాలు వచ్చాయి. తాజాగా పీవీపై మరో పుస్తకం వెలువడుతోంది. పీవీ నరసింహరావు ప్రధాన మంత్రి ఎలా అయ్యారు. 1991లో ఆయన ప్రధాని అవ్వడానికి దోహద పడిన పరిస్థితులపై '1991: హౌ పీవీ నరసింహరావు మేడ్‌ హిస్టరీ' అనే పుస్తకాన్ని పాత్రికేయుడిగా, మన్మోహన్‌కు మీడియా సలహాదారుగా పని చేసిన సంజయ్‌ బారు రచించారు.

ఈ పుస్తకంలో ఆనాడు జరిగిన అనేక అంశాలను వివరించారు. 1991లో ఒక్కో నెలలో ఏం జరిగిందో ఒక్కో అధ్యాయంలో సవివరంగా వివరించారు. అంతేకాదు అంతకు ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలనూ కూడా ఈ పుస్తకంలో ఆయన ప్రస్తావించారు. 1991లో తాను స్వయంగా ప్రధాని కాలేని సోనియాగాంధీ మరొకరికి ఆ పదవి అప్పగించాల్సి వచ్చింది. ఆ 'మరొకరి' ఎంపికపై చాలా కసరత్తే జరిగిందని పుస్తకంలో చెప్పారు.

''సోనియా గాంధీ కుటుంబ విధేయుల మద్దతువల్లే శరద్‌పవార్‌, అర్జున్‌సింగ్‌ తదితరులకంటే రేసులో పీవీ ముందు నిలిచారు. వారు పీవీ వైపు మొగ్గు చూపడానికి చాలా కారణాలుండొచ్చు. వారి దృష్టిలో పీవీ ఏం చెప్పినా 'చిత్తం' అని అంటారు. ఓ రబ్బరు స్టాంపులా వ్యవహరిస్తారు. అప్పటి రాజకీయాల్లో ఆయనకు ఏ మాత్రం ప్రాధాన్యం లేదు. వయసు మీద పడిన వృద్ధుడు'' అని సంజయ్‌ బారు తన పుస్తకంలో పేర్కొన్నారు.

అంతేకాదు సోనియా గాంధీ అప్పట్లో మరో ఆలోచన కూడా చేశారట. ''అప్పట్లో ఉప రాష్ట్రపతిగా ఉన్న శంకర్‌ దయాళ్‌ శర్మను ప్రధానిని చేయాలని సోనియా భావించారు. అయితే, తన ఆరోగ్యం అస్సలు బాగుండటంలేదంటూ శంకర్‌ దయాళ్‌ ఈ ఆఫర్‌ను తిరస్కరించారు'' అని నట్వర్‌సింగ్‌ను ఉటంకిస్తూ తెలిపారు.

ఆర్థికంగా, రాజకీయంగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పీవీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో 'ఆర్థిక మంత్రి' ఎంపిక కీలకంగా మారింది. మన్మోహన్‌ సింగ్‌ ఎంపిక వెనుక ఎంత కసరత్తు జరిగిందో కూడా సంజయ్‌ బారు తన పుస్తకంలో వివరించారు.

pv narasimha rao

ప్రధాని అయిన తొలి రోజుల్లో పీసీ అలెగ్జాండర్‌పై (ఇందిరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు) ఎక్కువగా ఆధారపడ్డారు. ప్రణబ్‌ ముఖర్జీని ఆర్థిక మంత్రిగా నియమించాలంటూ ఆయన సన్నిహితులు పీవీపై ఒత్తిడి తెచ్చారు. అయితే, అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఒక ఆర్థిక వేత్తను, నిపుణుడిని ఆర్థిక మంత్రిగా నియమించాలని పీవీ నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా పలువురి పేర్లను పరిశీలించారు. ఐజీ పటేల్‌ (అప్పటి ఆర్‌బీఐ గవర్నర్‌)ను ఎంపిక చేయాలని భావించారు. అయితే మంత్రి పదవి స్వీకరించేందుకు ఆయన నిరాకరించారు. దీంతో మరొకరి పేరు సూచించాల్సిందిగా పీసీ అలెగ్జాండర్‌ను పీవీ సలహా అడిగారు. ఆయన మన్మోహన్‌ సింగ్‌ పేరు సూచించారు.

అంతేకాదు అప్పట్లో రాష్ట్రపతిగా ఉన్న ఆర్‌. వెంకట్రామన్‌ కూడా ఆర్థిక మంత్రి పదవికి మన్మోహన్‌ పేరునే సూచించడం గమనార్హం. ఈ విషయంలో పీవీ ఇంటెలిజెన్స్‌ బ్యూరో సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ''1991 జూన్‌ 20వ తేదీ అర్ధరాత్రి తర్వాత విదేశీ పర్యటన నుంచి మన్మోహన్‌ తిరిగి వచ్చారు. 21వ తేదీ ఉదయాన్నే పీసీ అలెగ్జాండర్‌ ఆయనకు ఫోన్‌ చేశారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టాలని పీవీ ఆశిస్తున్నట్లు తెలిపారు'' అని సంజయ్‌ తన పుస్తకంలో వివరించారు.

అనంతరం ఆర్ధిక మంత్రి విధి నిర్వహణలో, నిర్ణయాలు తీసుకోవడంలో మన్మోహన్‌కు పీవీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. ''ప్రధాని అయిన తర్వాత ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌ను నియమించాలని రాజీవ్‌ నిర్ణయించుకున్నారు. ఆయన హత్యకు గురికాకుండా ఉంటే మన్మోహన్‌నే ఆర్థిక మంత్రిగా ఎంపిక చేసుకునేవారు'' అని పేర్కొన్నారు.

పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ''ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మేఖేల్‌ కామ్‌డెసస్‌ 1991 అక్టోబరులో పీవీని కలిశారు. ఆయనకు తన మనసులో మాటను పీవీ స్పష్టంగా చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగయ్యేందుకు ఏం చేయడానికైనా తాను సిద్ధమేనని, కానీ, తన వల్ల ఉద్యోగం పోయిందని ఏ ఒక్క కార్మికుడూ చెప్పొద్దని పీవీ తెలిపారు'' అని పుస్తకంలో వెల్లడించారు.

ఈ అంశంపై తిరుపతిలో జరిగిన ఏఐసీసీ సదస్సులో సంస్కరణలపై తన ఆలోచనలు, ఉద్దేశాలను పీవీ సవివరంగా చెప్పారు. 'రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేను చూసుకుంటా. మీరు మాత్రం స్వేచ్ఛగా పని చేయండి' అని మన్మోహన్‌ను, ఇతర అధికారులను బలవంతం చేయాల్సి వచ్చేదని పీవీ తనకు చెప్పినట్లు సంజయ్‌ బారు వెల్లడించారు.

అంతేకాదు తనకంటే వయసులో దాదాపు పదేళ్లు చిన్నవాడైన మన్మోహన్‌ సింగ్‌ పట్ల పీవీ ఎంతో ఆపేక్షగా వ్యవహరించేవారని సంజయ్ బారు తన పుస్తకంలో వివరించారు.

English summary
Late Prime Minister Minister P V Narasimha Rao was the “hero of 1991” when his government ushered in reforms that liberalised India’s economy. But the Rao of 1992 was different, senior Congress leader P Chidambaram said on Tuesday. He said while Rao was a “great helmsman of government” steering the country on the path of reforms” in 1991, he failed the Congress party organisationally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X