ఏపీకి తెలంగాణ షాక్.. : సెప్టెంబర్ 23న తేలనున్న పంచాయితీ..
హైదరాబాద్ : ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ పంచాయితీ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ల నడుమ నలుగుతోన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆస్తుల పంపకాల్లో భాగంగా.. ఏపీ భవన్ ను విభజించాలని కేంద్రం భావిస్తుండగా.. ఏపీ భవన్ పరిధిలో ఉన్న ఏడెకరాల హైదరాబాద్ హౌజ్ తెలంగాణకు చెందినది కావడంతో.. పంపకాల నుంచి హైదరాబాద్ హౌజ్ మినహాయించి, దాన్ని తెలంగాణ ఆస్తిగానే గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతోంది.
ఈ నేపథ్యంలోనే.. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఈనెల 23న కేంద్ర హోం శాఖ ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కాగా,ఢిల్లీలోని ఇండియా గేట్ పక్కన సుమారు 8.5 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ భవన్‌ను నిర్మించారు. దానికి ఆనుకుని ఉన్న నర్సింగ్ హాస్టల్‌లో సిబ్బంది క్వార్టర్స్ నిర్మించారు. అయితే పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో ఏపీ భవన్‌ను ఆనుకుని ఉన్న హైదరాబాద్ హౌస్‌ను కేంద్రానికి అప్పగించారు.

ఇతర దేశాల ప్రధానులతో సమావేశాలకు, వారితో విందు సమావేశాలు నిర్వహించుకోవడానికి హైదరాబాద్ హౌస్ అయితేనే ఉంటే బాగుంటుందన్న ఉద్దేశ్యంతో పీవీ ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి బదులుగా పటౌడీ హౌస్ పరిధిలోని ఏడు ఎకరాలను కేంద్రం ఏపీ భవన్‌కు అప్పగించింది. ప్రస్తుతం ఈ ఏడు ఎకరాల మీదనే వివాదం నెలకొంది.
ఇదిలా ఉంటే.. మొత్తం 19.5 ఎకరాలను జనాభా నిష్పత్తి ప్రకారం పంచాలన్నది ఏపీ వాదన. హైదరాబాద్ హౌస్ తెలంగాణకు చెందినది కావడం వల్ల.. దాని పరిధిలో ఉన్న ఏడెకరాలను మినహాయించి మిగతా 12.5 ఎకరాలను జనాభా నిష్పత్తితో పంచుకుందామనేది తెలంగాణ ప్రభుత్వం వాదన. హైదరాబాద్ హౌస్ ను నిజాం నవాబు నిర్మించడంతో.. అది తెలంగాణ ఆస్తిగానే ఉండాలనేది తెలంగాణ ప్రభుత్వ భావన.












Click it and Unblock the Notifications