హోదా: జగన్‌పై మేల్కొన్న బాబు, బిజెపిని ఆత్మరక్షణలో పడేసిన పవన్
విజయవాడ: ప్రత్యేక హోదా పైన మూడు రోజుల క్రితం రాజ్యసభలో కేంద్రమంత్రి హెచ్‌పీ చౌదరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యల పైన ఏపీ సీఎం చంద్రబాబు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇలా అందరూ స్పందిస్తున్నారు.
హోదా పైన కేంద్రమంత్రి వ్యాఖ్యల తర్వాత ఏపీలో బిజెపి పూర్తిగా ఇరుకున పడిపోయిందని చెప్పవచ్చు. అదే సమయంలో విపక్షాలైన వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రి చంద్రబాబును కార్నర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.
అయితే, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ముందుగానే మేల్కొన్నారని చెప్పవచ్చు. కేంద్రమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో విపక్షాలు తమను టార్గెట్ చేస్తాయని ముందే గ్రహించిన చంద్రబాబు, టిడిపి నేతలు కేంద్ర ప్రభుత్వం పైన ఘాటుగానే స్పందిస్తున్నారు.

తాము ప్రజల విషయంలో తప్ప ఎక్కడా రాజీపడేది (నో కాంప్రమైజ్) లేదని చంద్రబాబు కేంద్రాన్ని ఉద్దేశించి తీవ్రంగానే స్పందించారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... తాము చేతులు ముడుచుకొని కూర్చోమని, కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తామని చెప్పారు.
కారణం ఏదైనా, ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ కేంద్రం పట్ల తీవ్రంగానే స్పందిస్తోంది. ప్రతిపక్షాలకు తమను అనే అవకాశం ఇవ్వకుండా అయితేనేమీ, ఏదైనా టీడీపీ మాత్రం సీరియస్ అవుతోంది. ఇటీవలే టిడిపిలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ... హోదా విషయమై త్వరలో కేంద్రం నుంచి టిడిపి కేంద్రమంత్రులు తప్పుకుంటారని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలగాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు కేంద్రమంత్రి దాదాపు తేల్చిన చెప్పిన నేపథ్యంలో.. వైసిపి కంటే ముందే తాము కేంద్రం నుంచి వైదొలగుతామని చెప్పడం గమనార్హం. తద్వారా ప్రతిపక్షానికి తమను అనే అవకాశం ఇవ్వడం లేదని చెప్పవచ్చు.
ఇక, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి బిజెపి పైన ఘాటుగా స్పందించకపోయినప్పటికీ.. ఓ విధంగా తీవ్ర హెచ్చరిక చేసినట్లుగానే భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంపై ఇప్పటికే టిడిపి నేతలు ఆగ్రహంగా ఉన్నారని, హోదా విషయంలో అదే తప్పును బిజెపి చేయవద్దని పవన్ కళ్యాణ్ హితవు పలికారు. ఆయన ఆ విషయాన్ని మృదువుగా చెప్పినప్పటికీ.. అది బిజెపికి హెచ్చరిక అని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications