నేడు ఈ నరేంద్రుడు: యోగాసనాలేసిన బాబు
విజయవాడ: మన పూర్వీకులిచ్చిన వారసత్వ సంపద యోగా, ధ్యానం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈ సంపదను ప్రపంచానికి అందించాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారని చెప్పారు. నాడు ఆ నరేంద్రుడు (స్వామి వివేకానంద) మన దేశ ఔన్నత్యాన్ని, ప్రాభవాన్ని ప్రపంచానికి చాటి చెబితే, నేడు ఈ నరేంద్రుడు (ప్రధాని నరేంద్ర మోడీ) మన అపూర్వ సంపదను ప్రపంచానికి అందిస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు.
ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో జరిగిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వయంగా యోగాసనాలు వేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. నేడు మొత్తం ప్రపంచం ఒక మహా సంకల్పానికి శ్రీకారం చుట్టిందని, ఒక వ్యక్తి అనుకుంటే ఏదైనా సాధించగలమని ప్రధాని నరేంద్ర మోడీ నిరూపించారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగా అభివృద్ధి, యోగా అధ్యాపకులను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా రూ.25 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు సిఎం చంద్రబాబునాయుడు తెలిపారు. యోగాను ఆరోగ్యశాఖలో భాగంగా తీసుకుని అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామన్నారు. యోగా ద్వారా మంచి అరోగ్యం సాధించి సునాయాసంగా సంపద సృష్టించవచ్చని అన్నారు.

చంద్రబాబు, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు, ఆ తర్వాత అక్కడున్నవారిలో ఎంతో మార్పు కనిపించిందని, యోగా చేశాక అందరిలోను ఒక ప్రశాంతత, ఆత్మస్థైర్యం కనిపించయని అన్నారు. ఒకప్పుడు యోగాను ఒక మతం అనుకునేవారని, ఇప్పుడు ఆ భావన పోయి ఇదొక సైన్స్ అనే గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మందులు తీసుకుంటున్నట్టుగానే.. అనారోగ్యం రాకూడదంటే యోగా చెయ్యాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు యోగా చెయ్యడం ద్వారా మూడు గంటల చదువును అర్థగంటలో అవగతం చేసుకోవచ్చని, ఉద్యోగులు పది గంటలపాటు చేసే పని గంటలో ముగించవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. యోగా, ఆధ్యాత్మికత వల్ల మంచి కోరికలు వస్తాయంటూ ప్రధానమంత్రి ఇచ్చిన ఈ స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్ ముందుగా అందిపుచ్చుకుందన్నారు. జీవితంలో యోగాను తప్పనిసరిగా భాగం చేసుకోవాలని, కుల, మత, ప్రాంత, జాతి, స్థాయి భేదాలకు అతీతంగా అందరూ చెయ్యాలని కోరారు.
నేడు పిల్లలు పుట్టగానే స్మార్ట్ ఫోన్‌తో ఆడుకునే పరిస్థితి ఉందంటే, నాలెడ్జ్ మన చేతిలోనే ఉందని అర్థం చేసుకోవాలన్న ఆయన, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల ఆధారంగా యోగాతో పాటు ఎన్నో విషయాలను సునాయాసంగా నేర్చుకోవచ్చన్నారు. ఒత్తిడి లేని జీవితం కావాలంటే యోగా చెయ్యాలని, దీనిని ప్రారంభించినవారు వదిలిపెట్టవద్దని సూచించారు. చివరిగా ముఖ్యమంత్రి అక్కడున్నవారితో ప్రతిజ్ఞ చేయించారు.
చంద్రబాబు యోగాసనాలు
ప్రపంచ యోగా దినోత్సవం ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ నగరం ప్రధాన వేదికగా జరిగింది. నగరంలోని కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన యోగా ఉత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికార, అనధికార ప్రముఖులు, యువతీ యువకులు పాల్గొని యోగా చేశారు.
ముందుగా ప్రార్థనతో యోగా దినోత్సవం ప్రారంభమైంది. ధ్యానం తదితర యోగ ప్రక్రియలతో నిర్వాహకులు అందరితోనూ ఆసనాలు వేయించారు. అందరూ సులభంగా వేయగలిగే శశాంకాసనం, భుజంగాసనం, మకరాసనం, శవాసనం తదితర ఆసనాలు చేయించారు. ప్రాణాయామం, భ్రామరీ ప్రాణాయామం, ధ్యానం చేయించి వాటి వలన కలిగే శారీరక, మానసిక ప్రయోజనాలను తెలియజేశారు.












Click it and Unblock the Notifications